గద్వాల, వెలుగు: తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని, డబ్బు సంపాదన కోసం తాను రాజకీయం చేయడం లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. ఆదివారం గద్వాల పట్టణంలో మిషన్ తెలంగాణ–2023 ఎన్నికల సమాయత్తం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ జిల్లా ఎన్నికల ఇన్చార్జి చందు పాటిల్ తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీపై ప్రజలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, యువకుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. కార్యకర్తలంతా కష్టపడితే తెలంగాణలో కాషాయ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.
డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్లోకి వస్తున్న వారి పట్ల అలర్ట్ గా ఉండాలన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ఒక రోడ్ కూడా వేయలేదన్నారు. కేటిదొడ్డి మండలం కొండాపురం, గట్టు మండలం ఇందువాసి, మాచర్ల, మల్దకల్ మండలం దాసరిపల్లె, నాగర్ దొడ్డి, గద్వాల పట్టణంలోని ఏడో వార్డు నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ లీడర్లు బీజేపీలో చేరారు. రాంచంద్రారెడ్డి, గడ్డం కృష్ణారెడ్డి, బండల పద్మావతి, బండల వెంకట్రాములు, రామాంజనేయులు, నర్సింహులు, రజక జయశ్రీ, ఇసాక్, రాములు, కుమ్మరి శ్రీనివాసులు, నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు.