నారాయణపేట, వెలుగు: సాగునీటి అవసరాల కోసం రూపొందించిన పీఆర్ఎల్ఐ డిజైన్ మార్చి జాతీయ హోదా రాకుండా చేశారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైర్ అయ్యారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ డిజైన్ మార్చడంతో ఆ పార్టీ నాయకులు జేబులు నిండాయే తప్ప, ఉమ్మడి పాలమూరు ప్రజలతో పాటు ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి లాభం జరగలేదన్నారు. జూరాల నీటితో ప్రాజెక్టు నిర్మిస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలమయ్యేదని పేర్కొన్నారు. నార్లాపూర్ దగ్గర ఒక్క మోటర్ స్టార్ట్ చేసి నీళ్లిచ్చామని కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.
బీజేపీ ఈ సారి కేంద్రంతో పాటు రాష్ట్రంలో అదికారంలోకి వస్తుందని, జూరాల నీటితో ప్రాజెక్టు నిర్మించి సాగునీటిని అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ మోసపూరిత మాటలతో విసిగిపోయారని, ఈ సారి ఓడించటానికి రెడీగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేయడానికి వస్తోందని, ప్రజలు కాంగ్రెస్ మోసపు మాటలను గమనించాలని కోరారు. మహబుబ్నగర్లో జరిగే ప్రధాని సభను సక్సెస్ చేయాలని కోరారు. నాగురావు నామాజీ, కె రతన్ పాండురెడ్డి, బి కొండయ్య, జంగయ్య, కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, పి.శ్రీనివాసులు, సత్యయాదవ్, రఘురామయ్యగౌడ్, రఘువీర్యాదవ్ పాల్గొన్నారు.