రెండు రాష్ట్రాల సీఎంల భేటీలో సమస్యలు పరిష్కారం కావాలి : డీకే సమరసింహా రెడ్డి

రెండు రాష్ట్రాల సీఎంల భేటీలో సమస్యలు పరిష్కారం కావాలి : డీకే సమరసింహా రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఏపీ, తెలంగాణకు చెందిన సీఎంల భేటీని స్వాగతిస్తున్నానని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే. సమరసింహా రెడ్డి తెలిపారు. ఇది చాలా మంచి నిర్ణయమని చెప్పారు. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 6న హైదరాబాద్ లో సమావేశం కానుండటంతో సమరసింహారెడ్డి స్పందించారు.

గురువారం గాంధీభవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ సమస్యల పరిష్కారం విషయంలో చంద్రబాబు సానుకూలంగా వ్యవహారిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఢిల్లీలోని తెలంగాణ ఆస్తుల అంశం ఈ భేటీలో పరిష్కారం కావాలని కోరుకున్నారు. కృష్ణా బేసిన్ నీటి సమస్యను పరిష్కరించకుండా.. పెన్నా బేసిన్ నీటిని తీసుకెళ్తామని ఏపీ వాళ్లు అనడం సరైంది కాదన్నారు. కృష్ణా జలాల పంపకాల అంశంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలన్ని ఈ సమావేశంలో పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.