- ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు
- కేసీఆర్, కేటీఆర్ కర్నాటక వస్తే మేం ఏంచేస్తున్నమో చూపిస్తం: డీకే శివకుమార్
- తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు పుట్టిన రోజు కానుక ఇవ్వాలి
సూర్యాపేట, వెలుగు : తెలంగాణ ప్రజలు మార్పు కోసం ఎదురు చూస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవబోతున్నదని కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు పుట్టిన రోజు కానుక ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. డిసెంబర్ 9న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. ‘కర్నాటకలో చేసింది తెలంగాణ రాష్ట్రంలో చేసి చూపిస్తం.. అక్కడ మేం ఏమీ చేయలేదని కేసీఆర్, కేటీఆర్ విమర్శిస్తున్నారు. కానీ మేము ఏం చేస్తున్నమో చూసేందుకు అక్కడికి రావాలి’ అని డీకేసవాల్చేశారు.
శుక్రవారం సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్నగర్లో కాంగ్రెస్ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి, కోదాడ కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి డీకే పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ 60 ఏండ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వం నాగార్జునసాగర్ ను నిర్మిస్తే ఇంకా పటిష్టంగా ఉందని, లక్షల ఎకరాలకు నీరు అందిస్తోందన్నారు. మూడేండ్ల క్రితం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ అవినీతితో అప్పుడే కూలిపోతున్నదన్నారు. ఇందిరా, రాజీవ్, సోనియా, రాహుల్ గాంధీలకు తెలంగాణతో అవినాభావ సంబంధం ఉందని, రాష్ట్ర అభివృద్ధికి వారు ఎంతో సహకరించారని డీకే పేర్కొన్నారు.
ALSO READ: నల్గొండ లో స్థానికతకే పెద్ద పీట
సోనియా, రాహుల్, ఖర్గే, ఉత్తమ్, రేవంత్ రెడ్డి కలిసి ఆలోచించి ఆరు గ్యారంటీ లను ప్రకటించారని చెప్పారు. ఆరు గ్యారంటీ స్కీములను వంద రోజుల్లోనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ మాయమాటలకు మోసపోవద్దన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒక మునిగిపోయే నావా అని బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే చందర్రావు, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ రెడ్డి, స్థానిక కాంగ్రెస్, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.