
బెంగుళూర్: తెలంగాణ పొరుగు రాష్ట్రం కర్నాటక పాలిటిక్స్‌లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కర్నాటక కాంగ్రెస్ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గత కొద్ది రోజులుగా కన్నడ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. ముఖ్యమంత్రి పదవిపై ఆశ పెట్టుకున్న డీకే శివకుమార్.. సీఎం సీటు దక్కకపోవడంతో అసంతృప్తితో రగిలిపోతున్నారని.. త్వరలోనే ఆయన బీజేపీ గూటికీ చేరుతారని.. ఇందులో భాగంగానే ఇటీవల ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన మహా శివరాత్రి వేడుకల్లో బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షాతో కలిసి పాల్గొన్నారని కన్నడ పొలిటికల్ సర్కిల్స్‌లో ఊహగానాలు వినిపిస్తున్నాయి.
ALSO READ | Have Babies Now: కొత్తగా పెళ్లయినోళ్లంతా వెంటనే పిల్లల్ని కనండి: తమిళనాడు సీఎం స్టాలిన్
మరోవైపు ఈ ఏడాది చివర్లో కర్ణాటకలో నాయకత్వ మార్పు జరుగుతుందని అధికార కాంగ్రెస్ వర్గా్ల్లో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజు వి శివగంగ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2025, డిసెంబర్ నాటికి కర్నాటక సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరిస్తారని హాట్ కామెంట్స్ చేశారు.
వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందని.. డీకే శివకుమార్ 7.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారని జోస్యం చెప్పారు. కావాలంటే నా రక్తంతో రాసి ఇస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు.
కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ అత్యధిక సీట్లు గెలవడంలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు. డీకే శివకుమార్ పార్టీ కోసం చాలా త్యాగాలు చేశారని.. ఆయన మౌనాన్ని చేతగానితనంగా చూడొద్దన్నారు. పార్టీ హైకమాండ్‌కు ప్రతి ఒక్కటి తెలుసని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2023 మేలో జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
దీంతో ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. చివరికి సీనియారిటీ ఆధారంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించింది. కర్నాటకలో కాంగ్రెస్ విజయంలో కీ రోల్ ప్లే చేసిన డీకే శివకుమార్ కు అధిష్టానం డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చింది. హైకమాంద్ ఆదేశాలతో అయిష్టంగానే డీకే డిప్యూటీ సీఎం పోస్ట్ స్వీకరించారు.
అయితే.. "రొటేషన్ ముఖ్యమంత్రి" ఒప్పందం కుదిరిందని దీని ప్రకారం డీకే, సిద్ధరామయ్య చెరో రెండున్నర సంవత్సరాలు సీఎంగా ఉంటారని ప్రచారం జరిగింది. ఈ డీల్ లో భాగంగానే డీకే శివకుమార్ ఈ ఏడాది చివర్లో కర్నాటక సీఎం పగ్గాలు చేపడతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో డిసెంబర్ నాటికి డీకే శివకుమార్ సీఎం బాధ్యతలు స్వీకరిస్తారని అధికార పార్టీ ఎమ్మెల్యే కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఈ డీల్ గురించి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.