డీకేజెడ్ టెక్నాలజీస్ రూ.700 కోట్లు టోకరా.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని కస్టమర్లపై టోపీ

డీకేజెడ్ టెక్నాలజీస్ రూ.700 కోట్లు టోకరా.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని కస్టమర్లపై టోపీ

బషీర్ బాగ్, వెలుగు: తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని డీకేజెడ్  టెక్నాలజీస్ అనే సంస్థ 18 వేల మందిని మోసం చేసింది. దాదాపు రూ.700 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. దీంతో పెట్టుబడి పెట్టిన కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. ఆ కంపెనీ ఆస్తులు అమ్మి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. గురువారం హైదరాబాద్  అబిడ్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితుల తరఫు న్యాయవాది ఆషిర్  ఖాన్  మాట్లాడారు.

డీకేజెడ్​ టెక్నాలజీస్ సంస్థ చైర్మన్లు అశ్వఖ్  రహీల్, ఇక్బాల్  18 వేల మంది వద్ద సుమారు రూ.700 కోట్లు పెట్టుబడులుగా వసూలు చేశారని తెలిపారు. లాభాలు ఇస్తామని ఆశపెట్టి అసలుకే టోపీ పెట్టారని చెప్పారు. రూ.700 కోట్లు దండుకొని బోర్డు తిప్పేశారని పేర్కొన్నారు. సంస్థ చైర్మన్లు, సిబ్బందిపై అక్టోబరులో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశామని, నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారన్నారు. 

అయితే.. పోలీసులు కావాలనే దర్యాప్తును ఆలస్యం చేస్తున్నారని, నిందితులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. చైర్మన్లలో ఒకరైన ఇక్బాల్  ఇటీవలే బెయిల్ పై విడుదల అయ్యాడని వెల్లడించారు. వేల మంది ప్రజలు అప్పులు చేసి , వారి మాయమాటలు నమ్మి పెట్టుబడులు పెట్టారని, ప్రభుత్వం ఈ కేసులో చొరవ తీసుకుని సంస్థ ఆస్తులు జప్తుచేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.  

నమ్మకం కలిగించేందుకు మొదట్లో లాభాలు
తన సంస్థపై పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగించేందుకు డీకేజెడ్  టెక్నాలజీస్  తొలుత ఇన్వెస్టర్లకు లాభాలు ఇచ్చింది. ఇన్వెస్ట్  చేసిన కొన్ని నెలల పాటు పెట్టుబడిదారుల ఖాతాల్లో డబ్బులు జమచేశారు. తమ సంస్థకు సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్, ఫంక్షన్  హాల్స్ ఉన్నాయని, వాటిలో పెట్టుబడులు పెడితే ఇంకా ఎక్కువ లాభాలు ఇస్తామని సోషల్  మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లతో కంపెనీ చైర్మన్లు ప్రమోట్  చేయించారు. మొదట లాభాలు రావడంతో కస్టమర్లు అప్పు చేసి, బంగారం  అమ్మి పెట్టుబడులు పెట్టారు. కేటుగాళ్లు చివరికి రూ.700 కోట్లు దండుకుని పరారయ్యారు.