మాదాపూర్ లో రూ. 700 కోట్లతో బోర్డు తిప్పేసిన డీకేజెడ్ టెక్నాలజీస్ బాధితులు అబిడ్స్ లో మరోసారి సమావేశమయ్యారు. DKZ టెక్నాలజీస్ సంస్థ ఆస్తులను జప్తు చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని తమకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.
హైదరాబాద్ అబిడ్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో భాదితుల తరపు న్యాయవాది ఆషిర్ ఖాన్ మాట్లాడారు. DKZ టెక్నాలజీస్ సంస్థ ఛైర్మెన్ లు అశ్వఖ్ రహీల్ , ఇక్బాల్ లు సుమారు 18 వేల మంది బాధితుల నుంచి సుమారు రూ.700 కోట్ల పెట్టుబడులుగా వసూలు చేశారన్నారు. అయితే లాభాలు పక్కన పెడితే.. మొత్తం రూ. 700 కోట్ల రూపాయలు దండుకొని బోర్డు తిప్పేసినట్లు చెప్పారు.
ALSO READ | ఆశావర్కర్లకు రూ. 18వేల జీతం ఇవ్వాలి: తమ్మినేని వీరభద్రం
సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ఆలస్యం చేస్తున్నారని , నిందితులతో కుమ్మకైయ్యారని ఆరోపించారు . ఇటీవల ఒక చైర్మన్ ఇక్బాల్ బెయిల్ పై విడుదలయ్యారని చెప్పారు.. వేలాది మంది ప్రజలు అప్పులు చేసి , వాళ్ల మాయమాటలు నమ్మి పెట్టుబడులు పెట్టారని వెల్లడించారు. ప్రభుత్వం ఈ కేసులో చొరవ చూపి , డీకేజెడ్ సంస్థ ఆస్తులను జప్తు చేసి , బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
హైదారాబాద్ లోని మాదాపూర్ లో ఉన్న డీకేజెడ్ సొల్యూషన్స్ అనే సంస్థ 2024 సెప్టెంబర్ లో రూ. 700 కోట్ల భారీ మోసానికి పాల్పడింది. తమ కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి.. దాదాపు30 వేల మంది నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేసి ఇప్పుడు బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి 10 రోజులు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ బాధితులు సెప్టెంబర్ 13న హైదరాబాద్ బషీర్ బాగ్ లోని సీసీఎస్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.