ముంబై: రియల్టీ కంపెనీ డీఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్ అత్యంత సంపన్న రియల్ ఎస్టేట్ వ్యవస్థాపకుడిగా నిలిచారు. ఆయన నెట్‌వర్త్ విలువ రూ. 1,24,420 కోట్లకు చేరింది. తర్వాతి స్థానాల్లో మాక్రోటెక్ డెవలపర్స్ ఫౌండర్ మంగళ్ ప్రభాత్ లోధా ఉన్నారు. గురువారం విడుదలైన గ్రో -హురున్ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తల జాబితాలో గౌతమ్ అదానీ మూడవ స్థానంలో నిలిచారు.
లోధా కుటుంబం రూ.91,700 కోట్ల సంపదతో రెండో స్థానంలో నిలిచింది. అదానీ కుటుంబం 2023 నుంచి 62 శాతం పెరుగుదలతో రూ.56,500 కోట్ల సంపదతో మూడవ స్థానానికి చేరుకుంది. ఒబెరాయ్ రియాల్టీకి చెందిన వికాస్ ఒబెరాయ్ రూ. 44,820 కోట్ల సంపదతో నాలుగో స్థానంలో, రహేజా గ్రూప్‌కు చెందిన చంద్రు రహేజా, ఆయన కుటుంబం రూ. 43,710 కోట్ల నెట్‌వర్త్‌తో ఐదో స్థానంలో నిలిచింది.