యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట మండలం మల్లాపురం సర్పంచ్ కర్రె వెంకటయ్య వచ్చిన ఆరోపణలపై డీఎల్పీవో విచారణ చేపట్టారు. సర్పంచ్ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి రైతువేదిక పేరుతో ప్రభుత్వ నిధులతో బిల్డింగ్ నిర్మించాడని మాజీ సర్పంచ్ మంగ సత్యనారాయణ ఈ నెల 2న కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎల్పీవో యాదగిరి ఆఫీసర్లతో కలిసి బుధవారం మల్లాపురంలో విచారణ చేపట్టారు.
బిల్డింగ్ నిర్మించిన ప్లేస్‌ను పరిశీలించడంతో పాటు సర్పంచ్ , మాజీ సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ ఉపేశ్ స్టేట్ మెంట్ ను రికార్డు చేసుకున్నారు. అలాగే గ్రామంలో ఉన్న ప్రభుత్వ, శిఖం భూములు, నక్ష బాటలకు సంబంధించిన మ్యాపును పరిశీలించారు. అనంతరం డీఎల్పీవో మాట్లాడుతూ.. రెవెన్యూ ఆఫీసర్లు సర్వే చేసి ఇచ్చే రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
చెప్పులు మెడలో వేసుకుని తీరుగుతా
మాజీ సర్పంచ్ మంగ సత్యనారాయణ తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే చెప్పులు మెడలో వేసుకుని ఊరంతా తిరిగి, గ్రామం నుంచి వెళ్లిపోతానని మల్లాపురం సర్పంచ్ కర్రె వెంకటయ్య సవాల్ చేశారు. నిరూపించలేకపోతే అదే పని ఆయన చేయాలన్నారు. ఈ కామెంట్లకు స్పందించిన మాజీ సర్పంచ్ తాను చేసిన ఆరోపణలను నిరూపించలేకపోతే తనతో పాటు గ్రామస్తులమంతా చెప్పులు మెడలో వేసుకుని ఊరంతా తిరగడమే కాదు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతానని స్పష్టం చేశారు.