గద్వాల, వెలుగు: విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కావద్దని డీఎల్ఎస్ఏ సెక్రటరీ గంట కవితాదేవి సూచించారు. మంగళవారం బాలల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో గవర్నమెంట్ బాయ్స్ హైస్కూల్లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువుపైనే దృష్టి పెట్టాలని, సెల్ఫోన్లకు బానిస కావద్దన్నారు. అపరిచిత వ్యక్తులకు ఫోన్ నెంబర్ ఇవ్వవద్దని, వీడియో కాల్స్, ఫోన్లో చాటింగ్ చేయవద్దని సూచించారు. హెచ్ఎం ఇమాన్యుల్, లాయర్లు ప్రభాకర్, లక్ష్మన్న పాల్గొన్నారు.
క్రమశిక్షణతో చదవాలి..
నాగర్ కర్నూల్ టౌన్: విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని డీఎల్ఎస్ఏ సెక్రటరీ జి సబిత ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో జరిగిన బాలల దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాలతో శారీరక, మానసిక సమస్యలు వస్తాయని చెప్పారు. ఏమైనా సమస్యలు ఉంటే డయల్100కు ఫోన్ చేయాలన్నారు. పేద మహిళలు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీలకు ఉచిత న్యాయ సహాయం అందించడం జరుగుతుందన్నారు. అనంతరం కబడ్డీ, ఖోఖో పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. న్యాయవాదులు మధుసూదన్ రావ్, బాబు, ప్రశాంత రావు, రాంచందర్ పాల్గొన్నారు.
బాలల హక్కులను కాపాడాలి..
వనపర్తి: బాలల హక్కులను కాపాడాలని వనపర్తి న్యాయమూర్తి రజని సూచించారు. తెలంగాణ గిరిజన రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీలో డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. బాలల హక్కులు, చట్టాలు, బాల్య వివాహాల నిషేధం, బాధ్యతలను జడ్జి వివరించారు. న్యాయవాది డి.కృష్ణయ్య, సఖి కేంద్రం ఇన్చార్జి గోవర్ధన్, టీచర్లు పాల్గొన్నారు.