DMart: 5% పడిన డీమార్ట్ స్టాక్.. నిరాశపరిచిన Q4 ఫలితాలు, బ్రోకరేజ్ మాట ఇదే..

DMart: 5% పడిన డీమార్ట్ స్టాక్.. నిరాశపరిచిన Q4 ఫలితాలు, బ్రోకరేజ్ మాట ఇదే..

DMart Shares: నేడు ఇంట్రాడేలో డీమార్ట్ కంపెనీ షేర్ల ధర 5 శాతం పతనమైంది. దీంతో స్టాక్ ధర ఎన్ఎస్ఈలో రూ.4వేల దిగువకు చేరుకుంది. నిజానికి కంపెనీ తన మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన తర్వాత వాటిపై మార్కెట్లోని పెట్టుబడిదారులు నిరాశకు గురికావటమే పతనానికి కారణంగా ఉంది. ప్రస్తుతం రోజురోజుకూ క్విక్ కామర్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ భౌతిక స్టోర్లలో తక్కువ ధరలను ఆఫర్ చేస్తున్నప్పటికీ అమ్మకాల పరంగా డీమార్ట్ పెద్ద పోటీని అందుకుంటోంది.

ఆర్థిక ఫలితాలను పరిశీలిస్తే.. మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో దేశీయ రిటైల్ దిగ్గజం స్టాండలోన్ ఆదాయం రూ.14వేల 462 కోట్లుగా నమోదైంది. ఇది అంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.12వేల 393 కోట్ల కంటే 16.67 శాతం అధికం. ప్రధాన మెట్రో నగరాల్లో క్విక్ కామర్స్ స్టార్టప్ కంపెనీల సేవలు స్టోర్ అమ్మకాలను దెబ్బతీస్తున్న వేళ ఆదాయాలు ఊహించిన దానికంటే తక్కువగా నమోదు కావటంపై పెట్టుబడిదారులు నిరుత్సాహానికి గురయ్యారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా డీమార్ట్ మెుత్తంగా 415 రిటైల్ స్టోర్లను నిర్వహిస్తోంది. కాగా వీటిలో 28 స్టోర్లను మార్చితో ముగిసిన త్రైమాసికంలో కొత్తగా ప్రారంభించినవే. కేవలం ఒక్క త్రైమాసికంలో కంపెనీ ఇన్ని స్టోర్లను తెరవటం ఇదే తొలిసారి. కంపెనీ వ్యాపారం క్విక్ కామర్స్ దిగ్గజాలతో పాటు రిలయన్స్, స్టార్ బజార్, జూడియో వంటి సంస్థల నుంచి వస్తున్న పోటీ వల్ల కూడా దెబ్బతింటోందని యాక్సిస్ సెక్యూరిటీస్ వెల్లడించింది. దీనికి తోడు అనేక ఇతర అంశాలు కూడా అమ్మకాలను దెబ్బతీస్తున్నాయని బ్రోకరేజ్ పేర్కొంది. 

ALSO READ : Market Crash: మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్స్, అలర్ట్..

క్విక్ కామర్స్ కంపెనీలు ఇస్తున్న గట్టి పోటీని తట్టుకుని డీమార్ట్ తన వ్యాపార ప్రయాణాన్ని కొనసాగించగలదని బ్రోకరేజ్ అంచనా వేస్తోంది. పోటీని తగ్గించడానికి భారీ డిస్కౌంట్లను అందించడం వల్ల లాభాలు దెబ్బతింటున్నాయి. ఈ తరుణంలో కంపెనీ తన వ్యాపార మార్జిన్లను పెంచుకోవాల్సి ఉంటుందని యూఎస్ బ్రోకింగ్ సంస్థ సిటీ గ్రూప్ వెల్లడించింది. అప్పుడే ప్రస్తుతం ఉన్న స్టాక్ విలువను మార్కెట్లో కొనసాగించటం వీలవుతుందని పేర్కొంది. అయితే ప్రస్తుతం సిటీ గ్రూప్ డీమార్ట్ షేర్లకు SELL రేటింగ్ కొనసాగిస్తూ టార్గెట్ ధరను షేరుకు రూ.3వేల 350గా ప్రకటించింది. ఇది ప్రస్తుతం మార్కెట్లో ట్రేడవుతున్న రేటు కంటే దాదాపు 19 శాతం తక్కువ కావటం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది.