నల్లగొండ జిల్లా : నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే అఖిల అనే గర్భిణి ప్రాణాలు కోల్పోయిందంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగిన వ్యవహారంపై డీఎంఈ రమేష్ రెడ్డి స్పందించారు. నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ లోని వార్డులను ఇవాళ తనిఖీ చేశారు. ఎక్కడా క్లీన్ గా లేకపోవడంతో పాటు వైద్య సేవల్లో నిర్లక్ష్యంపై ఆయన మండిపడ్డారు. డీఎంఈ రాకపై సమాచారం అందడంతో నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కూడా ఆస్పత్రికి చేరుకున్నారు.
వార్డులను తనిఖీ చేసే క్రమంలో ఎమ్మెల్యే, డీఎంఈని వసతులపై రోగులు, వారి తరఫు బంధువులు నిలదీశారు. ‘‘ ప్రభుత్వ హాస్పిటల్ లో కనీస వసతులు లేవు. మీ కుటుంబంలో ఎవరికైనా జబ్బు చేసి వస్తే ఇలాంటి హాస్పిటల్ లోనే ట్రీట్మెంట్ చేయిస్తరా?’’ అంటూ ప్రశ్నించారు. పరిస్థితిని అర్థం చేసుకున్న ఎమ్మెల్యే కంచర్ల.. ఆస్పత్రి సూపరింటెండెంట్ లచ్చిరాం నాయక్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవలు అందించడం చేతకాకపోతే రాజీనామా చేసి వెళ్ళిపో అంటూ మండిపడ్డారు.