వికారాబాద్, వెలుగు: సీజనల్ వ్యాధులపై అలర్ట్ గా ఉండాలని డీఎంహెచ్‌వో డాక్టర్ పాల్వన్ కుమార్ సూచించారు. దోమల ద్వారా మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, మెదడు వాపు, చికున్ గున్యా వంటి వ్యాధులు వ్యాపిస్తాయని తెలిపారు. రెయిన్ సీజన్ లో తరచుగా మలేరియా, డెంగ్యూ కేసులు నమోదు అవుతాయని, ప్రైవేట్ ఆస్పత్రులు టెస్ట్ ల పేరిట భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఏ ఒక్కరూ కూడా డెంగ్యూ నిర్ధారణ కాకుండా చికిత్స చేయవద్దని సూచించారు.
ఎలిసా టెస్ట్ ద్వారా మాత్రమే నిర్ధారణ పరీక్షలు చేసి డెంగ్యూ చికిత్స ప్రారంభించాలని స్పష్టంచేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగ్యూ నిర్ధారణ చికిత్సలు చేస్తే పేషెంట్ వివరాలు డీఎంహెచ్ వో ఆఫీసులో తప్పక అందజేయాలని తెలిపారు. దోమలు పెరుగుదలను నియంత్రించడమే కాక దోమ కాటుకు గురికాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని సూచించారు. చికిత్స పొందడంలో ఎవరికైనా ఇబ్బందులు ఎదురైనా లేదా అధికంగా డబ్బులు వసూలు చేస్తే ఈ వాట్సప్ 7780478817 నంబర్ కు మెసేజ్ ద్వారా సమాచారం పంపితే మెడికల్ టీమ్ లు తగు సాయం చేస్తాయని వివరించారు.