- గుండాయిపేట్లో ఆర్ఎంపీలకు డీఎంహెచ్ఓ ఆదేశం
- పేషెంట్లకు హై డోస్ స్టెరాయిడ్లు, పెయిన్ కిల్లర్లు ఇస్తున్నట్లు గుర్తింపు
- ఆర్డీవో, డీపీఓతో కలిసి గ్రామంలో పర్యటన
- మృతులు పూజ, కాళిదాస్కుటుంబాలకు పరామర్శ
- ఓ ఆర్ఎంపీ దగ్గర ఎక్స్పైరీ అయిన సిరప్లు లభ్యం
కాగజ్ నగర్, వెలుగు: ఆర్ఎంపీలు స్థాయికి మించి ట్రీట్మెంట్ఇస్తున్నారని డీఎంహెచ్ఓ తుకారం భట్ ఫైర్ అయ్యారు. ఇంజెక్షన్లు, పెయిన్‌కిల్లర్లపై సరైన పరిజ్ఞానం లేకుండానే ఇస్తున్నారని మండిపడుతూ.. తదుపరి ఆదేశాల మేరకు గ్రామంలోని ఆర్ఎంపీలు ఎవరూ రోగులకు ట్రీట్మెంట్ఇవ్వొద్దని ఆదేశించారు. రెండ్రోజుల క్రితం కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గుండాయిపేట్లో ఇటీవల జ్వరంతో ఇద్దరు మృతిచెందిన నేపథ్యంలో కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశాల మేరకు డీఎంహెచ్ఓ నష్ట నివారణ చర్యలు చేపట్టారు.
సోమవారం ఆ గ్రామ పంచాయతీ ఆఫీస్‌లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఆర్డీవో సురేశ్, డీపీఓ బిక్షపతి గౌడ్‌తో కలిసి పరిశీలించారు. జ్వరాలు, కీళ్లు, కాళ్ల నొప్పు లతో బాధపడేవారి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని జిల్లా కేంద్రంలోని టీ హబ్‌కు పంపించారు. మృతులు జాడే పూజ(16), భోయర్ కాళిదాస్(32) కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు.
మెడికల్ షాప్‌లో భారీగా మందులు..
గ్రామంలో ఇటీవల జ్వరాలు, ఇతర వ్యాధులు రాగా స్థానిక ఆర్ఎంపీలు ఇష్టారీతిన ట్రీట్మెంట్ అందించారని స్థానికులు డీఎంహెచ్ఓ, ఆర్డీవో దృష్టికి తీసుకువచ్చారు. దీంతో గ్రామంలోని ఆర్ఎంపీల దగ్గరికి వెళ్లి ఎలాంటి ట్రీట్మెట్ చేస్తున్నారో అడిగి నోట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే గోవర్ధన్ సర్కార్ (జీడీ) అనే ఆర్ఎంపీ క్లినిక్‌లో తనిఖీ చేయగా 4 నెలల క్రితమే ఎక్స్పైరీ అయిన రెండు సిరప్‌లను గుర్తించారు. అదేవిధంగా క్లినిక్‌లో ఆయుర్వేదం, హాలోపతి, హోమియో మందులను గుర్తించారు. వీటన్నింటినీ మీరే ఇస్తారా అని అడిగితే ఆర్ఎంపీ అవునని సమాధానం ఇవ్వడంతో డీఎంహెచ్ఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఊరిలో ఉన్న ఏకైక మెడికల్ షాప్‌లో భారీ మొత్తంలో మందులు స్టోర్ చేసి ఉండడం, ఎలాంటి పేర్లు లేకుండా చిట్టీల మీద ప్రిస్క్రిప్షన్ రాసి ఉండడాన్ని గుర్తించి అక్కడి బుక్స్, రిజిస్టర్‌ను సీజ్ చేశారు.
సర్కార్ దావాఖానలో స్టాఫ్ లేరు..ఆర్ఎంపీలను కూడా బంద్ చేస్తే ఎట్లా ?
‘ఇక్కడి ఆరోగ్య మందిరంలో డాక్టర్ లేడు, కనీసం సిబ్బంది కూడా లేరు. ఇప్పుడు ఆర్ఎంపీలను కూడా ట్రీట్మెంట్చేయొద్దని ఆదేశిస్తే ఇప్పుడు మాకు ఏమైనా సమస్య వస్తే ఎక్కడికి వెళ్లాలి’ అని గ్రామస్తులు, మహిళలు డీఎంహెచ్ ఓ, అధికారులను ప్రశ్నించారు. అత్యవసరమైతే ఏం చేయాలి అని అడిగారు. ఆర్ఎంపీలు ట్రీట్మెంట్ అందించకుండా ఆదేశాలివ్వడం సరికాదన్నారు. దీనిపై డీఎంహెచ్ఓ స్పందిస్తూ.. ఆర్ఎంపీలు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని, అర్హతకు మించి వైద్యం చేయడం నేరమన్నారు. గ్రామస్తులకు సరైన ట్రీట్మెంట్ అందించేందుకు వైద్య శాఖ తరఫున కృషి చేస్తానని, త్వరలోనే డాక్టర్, సిబ్బందిని నియమిస్తామని హామీ ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.