ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి : డీఎంహెచ్​వో పల్వన్ కుమార్ 

 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి : డీఎంహెచ్​వో పల్వన్ కుమార్ 

సిద్దిపేట రూరల్, వెలుగు : ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని డీఎంహెచ్​వో డాక్టర్ పల్వన్ కుమార్ వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం జిల్లాలోని జగదేవ్ పూర్, తీగుల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది పనితీరు,  రికార్డులను పరిశీలించారు. ల్యాబ్ లో  పరీక్ష నమూనాలను రికార్డులు, ఫార్మసీ గదిలో ఉన్న మందులపై ఆరా తీశారు.

ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవలను రోగుల వద్దకు వెళ్లి అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఎంహెచ్​వో మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రానికి వచ్చిన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఐపీ, ఓపీల సంఖ్య పెంచాలని చెప్పారు. తల్లీబిడ్డల సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్​వో  శ్రీనివాస్, డాక్టర్లు సత్యప్రకాశ్, రాజ్ శేఖర్, సీహెచ్వో రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.