
- లోక్‌సభలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్య
- మంత్రి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ డీఎంకే ఎంపీలు
- ఎన్ఈపీపై చర్చలో బీజేపీ, డీఎంకే మధ్య మాటల యుద్ధం
- ప్రారంభమైన పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాలు
- రాజ్యసభలో డీలిమిటేషన్‌పై లొల్లి.. ప్రతిపక్షాల వాకౌట్
న్యూ ఢిల్లీ: ద్రావిడ మున్నేట్ర కజగం(డీఎంకే) ఎంపీలు అనాగరికులు, నిజాయితీలేనివారంటూ లోకసభలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై డీఎంకే ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి మాటలు తనను బాధించాయంటూ ఎంపీ కనిమొళి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ.. డీఎంకే ఎంపీలను అవమానించే ఉద్దేశం తనకులేదని, తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. దీంతో ఈ వివాదాస్పద వ్యాఖ్యలను స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు.
మలివిడత బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం లోక్‌సభలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ)పై చర్చలో ఈ వివాదం చోటుచేసుకుంది. బీజేపీ, డీఎంకే ఎంపీల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఎన్ఈపీ, త్రిభాషా సూత్రం అంశాలను డీఎంకే సభ్యులు లేవనెత్తారు. తమిళనాడులో కొత్త విద్యావిధానం అమలుకు కేంద్రం ఒత్తిడికి నిరసనగా.. డీఎంకే సభ్యులు వెల్ వైపు దూసుకెళ్లారు. దీనిపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. డీఎంకే సభ్యుల నిరసనలతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ ఓంబిర్లా సభను వాయిదా వేసి.. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించారు. ఆ తర్వాత కూడా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య చర్చ వాడివేడిగా సాగింది.
క్వశ్చన్ అవర్ సమయంలో రగడ
ప్రశ్నోత్తరాల సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ డీఎంకే వైఖరిపై విరుచుకుపడ్డారు. ‘పీఎంశ్రీ’ స్కీమ్‌పై అడిగిన ఒక ప్రశ్నకు.. తమిళనాడు ప్రభుత్వం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ఎన్ఈపీ అమలుకు ఎంఓయూపై సంతకం చేసేందుకు తొలుత అంగీకరించిన తమిళనాడు.. ఇప్పుడు వైఖరి మార్చుకుందన్నారు. కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ సహా పలు బీజేపీయేతర రాష్ట్రాలు ఈ అగ్రిమెంట్‌పై సంతకాలు చేశాయన్నారు.
ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తుతో డీఎంకే చెలగాటమాడుతోందని మండిపడ్డారు. వారు నిజాయతీ లేనివారని, విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఇచ్చేందుకు డీఎంకే సిద్ధంగా లేదన్నారు. భాషాపరమైన వివాదాలు సృష్టించడమే వారు పనిగా పెట్టుకున్నట్లున్నారని, రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడు సర్కారు చర్యలు ప్రజాస్వామ్య వ్యతిరేకం అని, వారు అనాగరికులని అన్నారు.
ప్రధాన్ వ్యాఖ్యలు బాధించాయి: కనిమొళి
వాయిదా తర్వాత సభ తిరిగి ప్రారంభం కాగా.. డీఎంకే సభ్యురాలు కనిమొళి మాట్లాడారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని అన్నారు. కనిమొళి వ్యాఖ్యలపై ప్రధాన్స్పందించారు. తన వ్యాఖ్యలు తమిళనాడు సభ్యులు, ప్రజలను బాధిస్తే వెనక్కి తీసుకునేందుకు సిద్ధమని చెప్పారు. ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.
రాజ్యసభలో డీలిమిటేషన్ హీట్
రాజ్యసభలో డీలిమిటేషన్‌తో పాటు త్రిభాషా విధానం అంశాలను డీఎంకే లేవనెత్తింది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చెలరేగింది. అలాగే, డూప్లికేట్ఓటర్ ఐడీ కార్డుల నుంచి ఓటర్ల సంఖ్య పెంచేందుకు అమెరికా నిధుల వరకు చర్చ జరపాలని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం పట్టుబట్టింది. రూల్ 267 కింద చర్చకు డిమాండ్ చేసింది. ఈ నోటీసులను డిప్యూటీ చైర్మన్తిరస్కరించారు. దీంతో సభనుంచి ప్రతిపక్ష సభ్యులు వాకౌట్‌చేశారు. కాగా, ప్రతిపక్ష నేతల తీరును రాజ్యసభ వ్యవహారాల మంత్రి జేపీ నడ్డా తప్పుబట్టారు. వారినుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఓటింగ్ వ్యవహారంపై చర్చకు పట్టబట్టడం పార్లమెంటును అవమానించినట్లేనని అన్నారు. డీలిమిటేషన్, ఎన్ఈపీ, త్రిభాషా సూత్రంపై డీఎంకే వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదని తెలిపారు. ప్రతిపక్ష సభ్యులకు సమస్యలపై చర్చించే ఉద్దేశమేలేదని, కేవలం ఆందోళనతో సభలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. వాయిదా తీర్మానానికి ముందు నిబంధనలను చదువుకోవాలని, ఎల్ఓపీ సహా ప్రతిపక్ష నేతలు రిఫ్రెషింగ్ కోర్సుకు వెళ్లి నియమ నిబంధనలను అవగాహన చేసుకోవాలని సూచించారు. రూల్స్ ప్రకారం ప్రతి అంశాన్ని చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
ఓటరు లిస్ట్‌లో అక్రమాలపై చర్చించాలి: రాహుల్
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ అంశంపై లోక్‌సభలో చర్చ జరపాలని పట్టుబట్టారు. ‘‘ఓటరు జాబితాపై దేశవ్యాప్తంగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ జాబితాపై చర్చలు జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి’’ అని పేర్కొన్నారు.