బరువు తగ్గాలంటే డైటింగ్ ఒక్కటే దారి. అందుకే ఈ మధ్య అందరూ రకరకాల డైట్స్ ను పాటిస్తున్నారు. అయితే డైటింగ్ తో ఓ కొత్త చిక్కు ఉందని ఇటీవల ఓ పరిశోధనలో తేలింది. పెద్ద వయసులో డైటింగ్ చేస్తే బరువుతో పాటు ఎముకల్లో సాంద్రత కూడా తగ్గుతోందని ఆ స్టడీ చేస్తోంది. వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ డెన్నిస్ విల్లేరియల్ బృందం చేసిన అధ్యయనంలో డైటింగ్ చేసేవారిలో శరీరం బరువుతో పాటు ఎముకల సాంద్రత కూడా తగ్గిపోతుందని, డైటింగ్ వల్ల వృద్ధుల్లో ఎముకలు విరిగే అవకాశం కూడా ఉంటుందని డాక్టర్లు చెప్పారు.
50 ఏళ్లు పైబడిన వాళ్లపై చేసిన ఈ అధ్యయనంలో బరువు తగ్గడానికి కొందరు కేవలం డైటింగ్ పై ఆధారపడితే, మరికొందరు డైటింగ్ తో పాటు వ్యాయామం కూడా చేశారు. వ్యాయామం చేయకుండా తిండి మాత్రమే తగ్గించిన వాళ్లలో బరువుతో పాటు ఎముకల సాంద్రత కూడా తగ్గుతున్నట్టు డాక్టర్లు గమనించారు. అందుకే డైటింగ్ చేసే వాళ్లు వ్యాయామంపై కూడా దృష్టి పెట్టాలి. వ్యాయామం వల్ల కండరాలతోపాటు ఎముకల పటుత్వం కూడా పెరుగుతుంది. అందుకే డైటింగ్ కన్నా ముందు వ్యాయామంతో బరువు తగ్గించుకొనే ప్రయత్నం చేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
Also Read : యోగి అంటే ఎవరు..యఙ్ఞం అంటే ఏమిటి