జగిత్యాల, వెలుగు : జగిత్యాల మాతా శిశు సంరక్షణ కేంద్రంలో గర్భిణి కడుపులో డాక్టర్లు కర్చీఫ్ వదిలేసిన ఘటనపై త్రీమెన్ కమిటీ ఎంక్వైరీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రిపోర్ట్‌ను కలెక్టర్‌కు అందజేయగా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. 16 నెలల కింద జగిత్యాలలోని ప్రభుత్వ దవాఖానలో డాక్టర్లు ఓ మహిళకు కాన్పు చేసి కుట్లు వేసి పంపించారు. తర్వాత బాధితురాలు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడింది. కొద్దిరోజుల కింద ఓ ప్రైవేట్దవాఖానలో స్కానింగ్ తీయించుకోగా కడుపులో కర్చీఫ్ ఉన్నట్టు తేలింది. దీంతో వేములవాడలోని ఓ డాక్టర్‌ను సంప్రదించగా సర్జరీ చేసి క్లాత్‌తో పాటు ఇన్ఫెక్షన్తో ఏర్పడిన రెండు గడ్డలను తొలగించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ విచారణకు త్రీ మెన్ కమిటీని ఏర్పాటు చేశారు. వారు జగిత్యాలలో డెలివరీ చేసిన డాక్టర్లు, సిబ్బంది, మరికొంతమందిని విచారించి రిపోర్ట్ తయారు చేశారు. అయితే, ఈ రిపోర్ట్ చూసిన కలెక్టర్ యాస్మిన్ బాషా వారిపై ఫైర్ అయినట్టు తెలిసింది. మరో సారి పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాలని ఆదేశించడంతో త్రీమెన్ కమిటీ బాధితురాలి తల్లిగారి ఊరైన బాన్సువాడకు వెళ్లినట్లు తెలుస్తోంది.
కమిటీ ఏం తేల్చిందంటే..
త్రీమెన్ కమిటీలో జగిత్యాల జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ రాములు, డీఎంహెచ్ఓ శ్రీధర్, మెటర్నిటీ హెచ్ఓడీ అరుణ ఉన్నారు. ఈ కమిటీ బాధితురాలు నవ్య శ్రీ కడుపు నుంచి తీసిన మాప్ (కర్చీఫ్) 10/10 సైజ్ లో ఉందని, జగిత్యాల ప్రభుత్వ దవాఖాన సరఫరా చేసే మాప్ సైజు 6/6 మాత్రమే ఉంటుందని చెప్పింది. బాధితురాలు చివరగా 2021లో జగిత్యాలలో సిజేరియన్ చేయించుకున్నట్టు చెబుతోందని, ఏడేండ్ల కింద, 2020లో సిజేరియన్ చేయించుకున్నా ఆ వివరాలు చెప్పలేదని పేర్కొంది. రెండోసారి సర్జరీ జరిగినప్పుడే మాప్ వదిలేసి ఉండవచ్చని కమిటీ అభిప్రాయపడగా, రెండోసారి కూడా జగిత్యాలలోనే సిజేరియన్ జరిగిందని బాధిత కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆరు నెలల కింద నిజామాబాద్ లో చేసిన సిటీ స్కాన్ ద్వారా మాప్(కర్చీఫ్) బయటపడిందని చెబుతున్న బాధితురాలు అప్పుడే జగిత్యాల దవాఖానపై ఎందుకు ఫిర్యాదు చేయలేదని కమిటీ ప్రశ్నించింది. ఈ నెల 8న వేములవాడలోని ప్రైవేటు దవాఖానలో ఆపరేషన్ చేయించుకుని డిశ్చార్జి అయ్యాక కూడా ఫిర్యాదు చేయకపోవడం వెనక ఆంతర్యం ఏమిటో అంతు చిక్కడం లేదని చెప్పింది. మాప్ రూపం రెండు నెలల్లోనే మారిపోతుందని, కానీ బాధితురాలి కడుపులో ఏడాదిన్నరగా మాప్ అలాగే ఉండడం తమకు విచిత్రంగా అనిపిస్తోందని చెప్పింది. రిపోర్టులో ఘటన జరగడానికి కారణం ఏమిటన్నది వివరించకుండా.. జగిత్యాల దవాఖాన డాక్టర్లు, సిబ్బంది తప్పు చేయలేదని లెటర్ రాసిచ్చారని పేర్కొనడం ఆశ్చర్యానికి గురి చేసింది.
ఫోన్లో వివరాలు తీసుకుంటారా ?
త్రీమెన్‌కమిటీ ఇచ్చిన రిపోర్టులో బాధితురాలితో ఫోన్లో మాట్లాడామని చెప్పడంతో కలెక్టర్ యాస్మిన్ బాషా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు వెళ్లి నవ్య శ్రీతో మాట్లాడాలని ఆదేశించినట్టు సమాచారం. సిటీ స్కాన్ చేయించుకున్న చోట, ఎక్కడెక్కడ పరీక్షలు చేయించుకుందో అక్కడికి వెళ్లి రిపోర్టు తయారు చేయాలని ఆదేశించారు. దీనికి గాను తమకు వారం గడువు కావాలని కమిటీ అడిగినట్లు తెలుస్తోంది. మరోవైపు గురువారం కలెక్టరేట్‌కు వచ్చిన బాధితు కుటుంబసభ్యులు కలెక్టర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. మరోవైపు హెల్త్ మినిస్టర్ హరీశ్‌రావు ఆదేశాల వైద్య విధాన్ పరిషత్ స్టేట్ ఆఫీసర్లు కూడా ఎంక్వైరీ చేయనున్నట్టు సమాచారం.
విచారణ సరిగ్గా చేయలే
రెండో సారి ఆపరేషన్ చేసినప్పుడు మాప్ వదిలేసి ఉండవచ్చని అధికారులు రిపోర్టులో చెప్పారు. అలా అయితే మూడోసారి గర్భం వచ్చినప్పుడు చేసిన స్కాన్ లో బయటపడాలి కదా.. జగిత్యాల దవాఖానలోని క్లాత్సైజ్, కడుపులో బయటపడింది ఒక్కటి కాదు అని చెబుతూ డాక్టర్లను రక్షించేందుకు రిపోర్ట్ తయారు చేసినట్టు ఉంది. కలెక్టర్‌పై నమ్మకం ఉంది. విచారణ కరెక్ట్ జరిపించి న్యాయం చేస్తుందని అనుకుంటున్నాం. ఆర్థికంగా చితికిపోయాం..ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
- కృష్ణ, బాధితురాలి మరిది