చట్టం ముందు అందరూ సమానులేనా?

చట్టం ముందు అందరూ సమానులేనా?

చట్టం ముందు అందరూ సమానులే.  చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ పదబంధాలు  వినడానికి  బాగుంటాయి.  కానీ,  అవి నిజం కాదని కొంతమంది పెద్దవాళ్లని చూసినప్పుడు అనిపిస్తోంది. సామాన్యులను చూసినప్పుడు నిజమే అనిపిస్తుంది.  వాస్తవంగా  చెప్పాలంటే  చట్టం ముందు అందరూ సమానులు కాదు.  ‘ఎవరి కోసం’  అన్న కథలో  తనమీద,  తన మిత్రులమీద  అన్యాయంగా కేసు పెట్టారని తెలిసి ప్రవీణ్​ న్యాయవాదిని సంప్రదిస్తాడు.  ఆరోజు  సాయంత్రం  అతడితోపాటు  మిత్రులను  పోలీసులు అరెస్టు చేసి  రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో మారేడుపల్లిలో ఉన్న మేజిస్ట్రేట్​ ముందు వాళ్లని హాజరుపరుస్తారు. తమకు బెయిల్​ ఇవ్వండి అని ఓ కాగితం మేజిస్ట్రేట్​కు చూపిస్తాడు ప్రవీణ్​. తమ న్యాయవాది కూడా వస్తున్నాడని ఆ మేజిస్ట్రేట్​కి విన్నవిస్తాడు. ఈ రాత్రి బెయిలా.. సోమవారం నాడు కోర్టులో బెయిల్​ పిటిషన్​ను దాఖలు చేసుకో అని చెప్పి వాళ్లని మేజిస్ట్రేట్ రిమాండ్​ చేస్తాడు.  ప్రవీణ్​కు ఆవేశం ముంచుకొస్తుంది. అవును సార్.  బెయిలు అడుగుతున్నాం. మేం సీరియస్​ నేరాలని చేయలేదు. ధర్నా చేశాం అంతే. 

రిట్​ పిటిషనులో సెలవు రోజుల్లో ఆర్నాబ్​ గోస్వామికి సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేయగా లేనిది మాకు ఇస్తే తప్పేంటి అంటాడు. అంతలో రిమాండు రిపోర్టును తీసుకుని పోలీసులు వాళ్లని లాక్కుని వెళతారు. మీరేమీ ఆర్నాబ్​ గోస్వామి కాదు. ప్రముఖ సినీతారలు కాదని ఆ మేజిస్ట్రేట్ మనసులో అనుకుంటాడు. కోర్టులు, ప్రాథమిక హక్కులు, చట్టాలు ఎవరి కోసం ఉన్నాయో ప్రవీణ్​కి అతని మిత్రులకు మరోసారి అర్థం అవుతుంది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఈరోజు దేశంలో, మన రాష్ట్రంలో జరుగుతున్న సంఘటలను చూస్తే  ప్రముఖమైన పదబంధాన్ని కోర్టులు, న్యాయమూర్తులు మరిచిపోయినట్టు అనిపిస్తుంది. అది న్యాయం జరగడమే  కాదు. జరిగినట్టు అనిపించాలి. ఈ పదబంధం యునైటెడ్​ కింగ్​డమ్​లో జరిగిన ఒక కేసు వల్ల ప్రాచుర్యం పొందింది. 1923వ  సంవత్సరంలో  మాక్​కార్తీ అనే వ్యక్తి  ఓ రోడ్డు ప్రమాదంలో  చిక్కుకుంటాడు.  అతను  అపాయకరంగా  డ్రైవింగ్​ చేశాడన్న ఆరోపణల్లో అతడిని ప్రాసిక్యూట్​ చేస్తారు.  అతడి  కేసుని  విచారిస్తున్న  న్యాయమూర్తుల  క్లర్క్​ సివిల్​ క్లైయిమ్​లోని  న్యాయవాదుల  సమూహంలో సభ్యుడు.  ఆ రోడ్డు  ప్రమాదం  వల్ల  ఉత్పన్నమైంది ఆ సివిల్​ కేసు.  మాక్​ కార్తీ మీద క్రిమినల్​ కేసు విచారణ పూర్తవుతుంది.  న్యాయమూర్తులు  బెంచి దిగి చాంబర్​లోకి వెళ్తారు.  వాళ్లతోపాటు  ఆ క్లర్క్​ అదే  న్యాయసమూహంలోని  సభ్యుడు  కూడా  న్యాయమూర్తుల చాంబర్​లోకి  వెళతారు.  మాక్​కార్తీకి కోర్టు శిక్షను విధిస్తుంది అదే  రోజు. తీర్పు చెప్పే చర్చల్లో ఆ క్లర్క్​ కూడా పాల్గొన్నాడని, ఆ కారణాన్ని పేర్కొంటూ అప్పీలు దాఖలు చేశాడు మాక్​కార్తీ. ఈ విషయం గురించి దిగువ కోర్టుని వివరణ అడుగుతుంది అప్పిలేట్​ కోర్టు.

న్యాయం జరిగినట్టు అనిపించాలి

మేం చర్చించుకున్నప్పుడు మా చాంబర్​లో క్లర్క్​ ఉన్నది వాస్తవమే.  కానీ, అతను మా చర్చల్లో పాలుపంచుకోలేదని, జ్యూరీ న్యాయమూర్తులం మాత్రమే చర్చించుకొని తీర్పును వెలువరించామని ఆ న్యాయమూర్తులు తమ ప్రమాణ పత్రాలను కింగ్స్​ బెంచికి సమర్పించారు.  కింగ్స్​ బెంచి మాక్​కార్తీ అప్పీలును విని అతడి అప్పీలును ఆమోదించింది. కింగ్స్​ బెంచిలోని లార్డ్​హెవర్ప్​ ప్రధాన న్యాయమూర్తి తీర్పును ప్రకటిస్తూ ఇలా అన్నాడు.. ‘జ్యూరీలోని న్యాయమూర్తులు ఆ క్లర్క్​తో సంప్రదించకపోవచ్చు. ఆ క్లర్క్​ వాళ్ల చర్చల్లో పాలుపంచుకోకపోవచ్చు. వాళ్లు తమముందు ఉన్న సాక్ష్యాల ఆధారంగా శిక్షని విధించి ఉండవచ్చు.  ఇక్కడ ముఖ్యమైన విషయం శిక్ష కాదు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం న్యాయం జరగడమే కాదు. 

అది జరిగినట్టు స్పష్టం కావాలి. అంటే న్యాయం జరిగినట్టు అనిపించాలి’. ఈ న్యాయసూత్రం ఆ కేసునే కాదు. ప్రతి కేసుకి వర్తిస్తుంది. అదేవిధంగా ఒక ప్రాంతానికే కాదు. ఒక   దేశానికి కాదు. ప్రపంచంలోని అన్ని దేశాలకి, అన్ని  ప్రాంతాలకి ఈ సూత్రం వర్తిస్తుంది.

పదవీ బాధ్యతలు స్వీకరించేముందు.. న్యాయమూర్తి  ప్రమాణం

అల్లు అర్జున్​ బెయిలు ఉత్తర్వులు చదివిన తరువాత ‘ఎవరి కోసం’ అన్న కథ, యునైటెడ్​ కింగ్​డమ్​లోని కింగ్స్​బెంచ్​ ప్రధాన న్యాయమూర్తి  1923లో  చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.  రిట్​ పిటిషన్ లో,  క్వాష్​ పిటిషన్​లో బెయిలు  మంజూరు చేయడమన్నది అసాధారణ విషయం.  గతంలో విననిది.  చూడనిది. మరీ అందులో వ్యక్తిగత పూచీకత్తు మీద విడుదల చేయడం ఇంకా అసాధారణమైన విషయం. ఇలాంటి ఉత్తర్వుల మీద ఫైనాలిటీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  అలా రానప్పుడు కొంతమందికి కోర్టులు అనుకూలంగా ఉన్నాయన్న అపవాదు వస్తుంది. ఫైనాలిటీ రావడం కోసం ప్రభుత్వం ఈ ఉత్తర్వులు మీద సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో  తెలియదు. అప్పీలో, స్పెషల్​ పిటిషనో వేయకపోతే ప్రభుత్వం కూడా సినీ నటుల పట్ల ఉదారంగా ఉన్నట్లు ప్రజలు భావించే పరిస్థితి ఏర్పడుతుంది.  న్యాయమూర్తులు   వ్యక్తులనుబట్టి కాకుండా  కేసుని బట్టి  వాటిని పరిష్కరించాల్సి ఉంటుంది.  న్యాయమూర్తిగా  పదవీ బాధ్యతలు స్వీకరించే ముందు ప్రమాణం చేస్తారు.  భగవంతుని ఎదుటగానీ, అంతరాత్మ సాక్షిగా కానీ వాళ్లు ప్రమాణం చేస్తారు.

న్యాయం అందరికీ లభించాలి

... అనే నేను, భారత రాజ్యాంగం  ఎడల నిజమైన విశ్వాసాన్ని,  భక్తిని కలిగి ఉంటాను అని, దేశ సార్వభౌమత్వాన్ని, సమైక్యతని కాపాడుతాను అని, నిజంగా,  విధేయంగా,  ఎటువంటి భయంకానీ,  పక్షపాతంగానీ,  స్వార్థ చింతన లేకుండా,  అత్యంత విశ్వాసపాత్రంగా,  నా శక్తి మేరకు న్యాయంగా  నా విధులను నిర్వర్తిస్తానని, రాజ్యాంగాన్ని చట్టాలను పరిరక్షిస్తాను అని..ఈ ప్రమాణ పత్రాన్ని పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని న్యాయమూర్తులు ఆలోచించుకోవాలి. మనస్సాక్షిని ప్రశ్నించాలి. ఈ ప్రమాణ పత్రాన్ని పాటించకపోతే చట్టం ముందు అందరూ సమానులు కాదన్న విషయం బలపడుతుంది. ఈ ప్రమాణ పత్రాన్ని రోజూ ఉదయం ప్రతి న్యాయమూర్తి చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శిక్షవేసిన న్యాయమూర్తి సంతకం, రిమాండ్​ చేసిన న్యాయమూర్తి సంతకం తడి ఆరకముందే బాబులకు, బామ్మర్దులకి, సల్మాన్​ఖాన్, అల్లు  అర్జున్​కే  కాదు అందరికీ లభించాలి. 

- డా. మంగారి రాజేందర్
జిల్లా జడ్జి (రిటైర్డ్​)