- లంగర్‌హౌస్‌లో ఖాళీ బిందెలతో మహిళల ధర్నా
- నాలుగు నెలలుగా మురికి నీళ్లే వస్తున్నాయని మండిపాటు
మెహిదీపట్నం, వెలుగు: నాలుగు నెలలుగా మురికి నీళ్లే వస్తున్నా ఎవరూ పట్టించుకోవట్లేదని, ఈ మురికి నీళ్లను మంత్రులు ఒక్కరోజైనా తాగుతారా? అని మహిళలు మండిపడ్డారు. శనివారం హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని గాంధీనగర్ మహిళలు ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. మురికి నీళ్లు తాగి వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో ఆస్పత్రుల పాలవుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల ధర్నా గురించి తెలుసుకున్న జలమండలి అధికారులు, ప్రజాప్రతినిధులు అక్కడకు చేరుకున్నారు. దీంతో అధికారులను మహిళలు నిలదీశారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీస్కోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉచితంగా నీళ్లివ్వకపోయినా ఫర్వాలేదుగానీ.. కలుషితంకాని మంచి నీళ్లను ఇస్తే చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏ ఒక్క ప్రజా ప్రతినిధి కూడా నాలుగు నెలల్నుంచి ఇక్కడకు రాలేదని, సమస్యను పరిష్కరించలేదని ఆరోపిస్తూ నేతలు, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించకుంటే జలమండలి ఆఫీసును ఖాళీ బిందెలతో ముట్టడిస్తామని హెచ్చరించారు. కొన్ని నెలలుగా మురికి నీళ్లు వస్తున్న మాట నిజమేనని, ఎంత వెతికినా సమస్య ఎక్కడుందో తెలియడం లేదని జలమండలి సీజీఎం ఆనంద్ అన్నారు. రెండ్రోజుల కిందట్నే సమస్యను గుర్తించామని, వెంటనే రిపేర్లు చేస్తామని, రెండు రోజుల్లో మంచినీళ్లను సరఫరా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.