హీరో మంచు విష్ణు వాయిస్ దుర్వినియోగం చేయొద్దు

హీరో మంచు విష్ణు వాయిస్ దుర్వినియోగం చేయొద్దు
  • ఆయనకు సంబంధించినఅవమానకర లింక్​లు తొలగించాలి
  • పరువు నష్టం దావా కేసులో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ, వెలుగు: హీరో మంచు విష్ణు పేరు, గొంతు, ఆయన తీసిన సినిమాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా దుర్వినియోగం చేయొద్దని యూట్యూబర్లను ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. ఆయనకు సంబంధించిన అవమానకరమైన లింకులను నిలిపివేయాలని ఐటీ, టెక్నాలజీ మంత్రిత్వ శాఖలను కోర్టు ఆదేశించింది. ప్రతివాదులుగా ఉన్న యూట్యూబర్లు 48 గంటల్లోపు ఈ లింక్ లను తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. లేనిపక్షంలో వారి ఛానల్స్ ను నిషేధిస్తామని హెచ్చరించింది. తన పేరు, గొంతు, సినిమాలను యూట్యూబర్లు వాడుతూ పరువుకు నష్టం కలిగిస్తున్నారని మంచు విష్ణు ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్ ను జస్టిస్ మిని పుష్కర్ణ విచారణ జరిపి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. మంచు విష్ణుకి వ్యతిరేకంగా యూట్యూబ్ చానెళ్లలో ఉన్న వీడియోలు, కంటెంట్‌‌ను తొలగించాలని పేర్కొన్నారు. ఆయన పేరును దుర్వినియోగం చేయొద్దని హెచ్చరిస్తూ తీర్పును వెలువరించారు. ఈ తీర్పుపై విష్ణు తరపు న్యాయవాది ప్రవీణ్ ఆనంద్ సంతోషం వ్యక్తం చేశారు.