- రైస్ మిల్లర్లకు హైకోర్టు ఆదేశం
- ఆస్తుల జప్తు చెల్లదన్న సింగిల్ జడ్జి తీర్పుపై ప్రభుత్వం అప్పీలు
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం అప్పగించిన ధాన్యం ఆధారంగా కస్టమ్స్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను పౌరసరఫరాల శాఖకు అప్పగించకపోవడంతో రెవెన్యూ రికవరీ చట్టం కింద జప్తు చేసిన స్థిరాస్తులను అన్యాక్రాంతం చేయరాదని మిల్లర్లకు హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా రెవెన్యూ రికవరీ చట్టాన్ని అమలు చేయడానికి ముందు నోటీసులు జారీ చేశారో లేదో చెప్పాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సీఎంఆర్‌ను పౌరసరఫరాల సంస్థకు అప్పగించనందుకు మిల్లర్ల ఆస్తులను జప్తు చేయడం చెల్లదంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం అప్పీళ్లు దాఖలు చేసింది.
వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. అడ్వకేట్ జనరల్ ఏ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం అప్పగించిన ధాన్యాన్ని తిరిగి అందజేయడానికి తగిన సమయం ఇచ్చామన్నారు. అయినా మిల్లర్లు స్పందించకపోవడంతో కలెక్టర్లు తనిఖీ చేసి ధాన్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒప్పందాన్ని ఉల్లంఘించినప్పుడు చర్య తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని, ఎలాంటి నోటీసు జారీ చేయాల్సిన అవసరంలేదన్నారు.
మిల్లర్ల నుంచి రూ.70 కోట్ల నుంచి 90 కోట్ల దాకా రావాల్సి ఉందన్నారు. మిల్లర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ రెవెన్యూ రికవరీ చట్టం కింద ఎలాంటి నోటీసులు జారీ చేయలేదన్నారు. కంపెనీలకు చెందిన వ్యవహారంలో డైరెక్టర్ల ఆస్తులను జప్తు చేయడం చెల్లదన్నారు. అంతేకాకుండా ఒప్పందంలో ఆర్బిట్రేషన్ నిబంధన ఉన్నప్పుడు రెవెన్యూ రికవరీ చట్టాన్ని వినియోగించడం కుదరదన్నారు. ధాన్యం సరఫరాకు సంబంధించి మిల్లర్లకు, పౌరసరఫరాల సంస్థకు ఒప్పందం కుదిరిందని, అందులోని రెండో పార్టీ ఒక్కటే తప్పు జరిగిందని నిర్ణయించడం సమంజసం కాదన్నారు.
వివాదాన్ని స్వతంత్ర సంస్థ పరిష్కరించాల్సి ఉందని చెప్పారు. రబీలో సర్కారు మూడు రెట్ల ఎక్కువ ధాన్యాన్ని మిల్లులకు తరలించిందని, ధాన్యం నిల్వకు చోటులేదన్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. మిల్లింగ్, రవాణా ఛార్జీలను కూడా ప్రభుత్వం చెల్లించలేదన్నారు. ఈ దశలో ఏజీ జోక్యం చేసుకుంటూ నోటీసులు జారీ చేశారో లేదో వివరణ ఇవ్వడానికి గడువు కావాలని కోరారు. దీంతో విచారణను నవంబరు 5వ తేదీకి వాయిదా వేస్తూ, ఈలోగా స్థిరాస్తులను అన్యాక్రాంతం చేయరాదంటూ ప్రతివాదులైన మిల్లర్లను ఆదేశించింది.