కొందరు ప్రొఫెసర్లు తమ పదవులు, స్వలాభమే ఎజెండాగా పనిచేశారు. గత ప్రభుత్వంలో విసీలుగా, వివిధ పదవుల్లో పనిచేసిన ఇలాంటి ప్రొఫెసర్లను పునర్ నియామకం చేయకూడదు.కేసీఆర్ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ కార్యకర్తలా పనిచేసిన ప్రొఫెసర్లను వీసీలుగా ఎలాంటి పదవుల్లో నియామకం చేయవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి. మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పదేండ్ల పరిపాలనలో విద్యా వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి, తెలంగాణ ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించి ఉద్యమానికి ఊపిరి అందించిన ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ వంటి యూనివర్సిటీలను పదేండ్లలో నిర్వీర్యం చేశారు.
అలాగే, కాంగ్రెస్ హయాంలో ఏర్పాటుచేసిన మహాత్మా గాంధీ, తెలంగాణ యూనివర్సిటీ వంటి వాటిని కేసీఆర్ తన పదేండ్ల పరిపాలనలో ఎలాంటి మౌలిక వసతులు కల్పించకుండా చేసి, యూనివర్సిటీలలో అర్హులకు ఫెలోషిప్ లు ఇవ్వకుండా, మెస్ ఫీజులు అధికంగా పెంచి, ప్రైవేటు విద్యాసంస్థల కంటే ఘోరంగా గ్రామీణ నిరుపేద విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయడం జరిగింది. దానికి తోడు యూనివర్సిటీలలో నిర్బంధాలు, మేధో చర్చలు లేకుండా సమావేశాలపై ఆంక్షలు విధించారు. ఓయూలో కేవలం బీఆర్ఎస్ కార్యక్రమాలకే అనుమతులు ఇచ్చి, వారి నాయకులకు సాదర స్వాగతం పలికి, మరోవైపు సాక్షాత్ రాహుల్ గాంధీ పర్యటన కు అనుమతి ఇవ్వకుండా బీఆర్ఎస్ కార్యకర్తలా ఓయూ వీసీ వ్యవహరించిన తీరు చూశాం. ఉద్యమాల కేంద్రాలు అయిన యూనివర్సిటీలలో ప్రశ్నించిన విద్యార్థులపై కేసులు మోపి దాడులు చేయించిన తీరు కేయూలో చూశాం. ఇలాంటి ఘోరాలు గత ప్రభుత్వంలో నిత్యం జరిగాయి. ఇలాంటి సంఘటనలు సమైక్య రాష్ట్రంలో కంటే ఎక్కువగా జరిగాయి. దీనికి కారణం కేసీఆర్ వ్యక్తిగత ఆలోచనా విధానానికి అనుగుణంగా కనీస నైతిక విలువలు మరిచారు. ఉన్నత విద్యలో ఇంకా కొనసాగుతున్న మరికొందరు ప్రొఫెసర్లను, అధికారులను కూడా తొలగించాలి. సైద్ధాంతిక విలువలు, రాష్ట్ర పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ బలోపేతం చేయడం కోసం నిబద్ధత కలిగినటువంటి ప్రొఫెసర్లని వైస్ ఛాన్సలర్లుగా, ఉన్నత విద్యలో నియామకం చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల పక్షాన ప్రజా పాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాం.
-
వలిగొండ నరసింహ, ఓయూ విద్యార్థి నాయకుడు