సోషల్ మీడియాలోని పీసీసీ లిస్టులను నమ్మొద్దు: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

సోషల్ మీడియాలోని పీసీసీ లిస్టులను నమ్మొద్దు: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: పీసీసీ కార్యవర్గం, డీసీసీ అధ్యక్షుల ప్రతిపాదనల పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లిస్టులను కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నమ్మొద్దని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. బుధవారం ఆయన హైదరాబాద్ లో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. పీసీసీ కార్యవర్గం, డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ నేతల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఆబ్జర్వర్లను నియమించామని, వారు అక్కడ పర్యటించి నివేదిక ఇచ్చిన అనంతరమే ఈ నియామకాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అందుకే ఇలాంటి తప్పుడు జాబితాలను నమ్మొద్దని కోరారు. 

నా ఆడియోను వక్రీకరించారు: సంజీవ రెడ్డి

తన ఆడియోను వక్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే  సంజీవ రెడ్డి అన్నారు. బుధవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తాగునీటి సమస్యపై తనకు మహేశ్ అనే వ్యక్తి ఒకరు ఫోన్ చేస్తే.. దానికి సంబంధించిన ఆడియోను ఉద్యోగాలకు సంబంధించిన అంశానికి జోడించి తన ఆడియోను వైరల్ చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, దీని వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందన్నారు.