న్యూఢిల్లీ: ప్రభుత్వాలను విమర్శిస్తూ వార్తలు రాసే జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టొద్దని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ జర్నలిస్టుల రాసే రచనలను ప్రభుత్వ విమర్శగా భావించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయకూడని పేర్కొంది. కాగా, జర్నలిస్టు అభిషేక్ ఉపాధ్యాయ్ ఉత్తరప్రదేశ్‌లో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అభిషేక్ ఉపాధ్యాయ్ పిటిషన్‌పై జస్టిస్ హృషికేష్ రాయ్, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఇవాళ(అక్టోబర్ 4) విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం జర్నలిస్టు రాసిన రాతలను ప్రభుత్వంపై విమర్శలుగా భావించి ఆర్టికల్ రాసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టకూడదని ఘాటుగా వ్యాఖ్యానించింది.
ALSO READ | జైళ్లలో కుల వివక్షను సహించం: సుప్రీం
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం జర్నలిస్టుల హక్కులను పరిరక్షించడంతోపాటు.. ప్రజాస్వామ్య దేశాల్లో తమ అభిప్రాయాలను వ్యక్తీకరించే స్వేచ్ఛను గౌరవిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. జరల్నిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. అనంతరం ఈ కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ్‌పై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకూడదని పోలీసులను ఆదేశించింది.