న్యూఢిల్లీ, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియ మొదలైన తర్వాత మధ్యలో నిబంధనలు మార్చుతామంటే కుదరదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్కు ముందే నిబంధనలు సిద్ధం చేసి, ఆ తర్వాతే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని సూచించింది. అంతేతప్ప, జాబ్ అర్హత ప్రమాణాలను నియామక ప్రక్రియ మధ్యలో మార్చకూడదని స్పష్టం చేసింది.
"కె మంజుశ్రీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ " కేసుకు సంబంధించి 2008లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. రాజస్థాన్ హైకోర్టులో 13 ట్రాన్స్ లేటర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. తొలుత రాత పరీక్ష ఉంటుందని, అనంతరం ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని అందులో తెలిపారు. దీని ఆధారంగా మెరిట్ సాధించిన వారికి ఉద్యోగాలు కల్పిస్తామని వివరించారు. అయితే,13 ట్రాన్స్ లేటర్ పోస్టులకు 21 మంది అభ్యర్థులు హాజరు కాగా, అందులో ముగ్గురిని ఎంపిక చేశారు. కనీసం 75% మార్కులు సాధించిన వారినే ఎంపిక చేసినట్లు హైకోర్టు తన ప్రకటనలో వెల్లడించింది.
రూల్స్ మార్చారని కోర్టుకెక్కిన అభ్యర్థులు
అసలు నోటిఫికేషన్ లో 75 శాతం మార్కులు తప్పనిసరి అనే విషయం చెప్పలేదని, సవరించిన రూల్స్ తర్వాతే ముగ్గురిని ఉద్యోగాలకు ఎంపిక చేశారని మిగిలిన అభ్యర్థులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను హైకోర్టు 2010 మార్చిలో కొట్టివేయడంతో.. అభ్యర్థులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు 2008లో మంజుశ్రీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌లో తీర్పును బెంచ్ ప్రస్తావించింది.
రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ మొదలుకావడానికి ముందే కచ్చితమైన నియమ నిబంధనలు రెడీ చేసుకోవాలని తెలిపింది. ఆ తర్వాత వాటిని మార్చడానికి వీల్లేదని వెల్లడించింది. మధ్యలో నిబంధనలు మార్చి అభ్యర్థులను ఇబ్బంది పెట్టకూడదని సూచించింది. నియామక ప్రక్రియ నిబంధనలు ఎవరికి నచ్చినట్లు వారు మార్చడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. ఇది రాజ్యాంగానికి విరుద్ధమని చెప్పింది. రూల్స్ ఏకపక్షంగా కాకుండా..రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కు అనుగుణంగా ఉండాలని పేర్కొంటూ తుది తీర్పు వెలువరించింది.