
- అవసరమైతే ట్రిబ్యునల్ విచారణకు వస్త
- దశాబ్దాలుగా మనకు అన్యాయం జరుగుతున్నది
- న్యాయం జరిగే వరకూ పోరాటం ఆపేది లేదు
- కోర్టు కేసుల వివరాలన్నీ ఇవ్వాలని ఆదేశం
- జలసౌధలో లీగల్‌టీమ్, ఇరిగేషన్ అధికారులతో మంత్రి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా దక్కే వరకూ పోరాటం ఆపేది లేదని ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాలపై రాజీపడేది లేదని తేల్చి చెప్పారు. ట్రిబ్యునల్‌లో వాదనలు వినిపిస్తున్న లీగల్టీమ్కు ఎలాంటి సాయం అందించేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కృష్ణా, గోదావరి జలాల వివాదంపై అవసరమైతే తానే స్వయంగా ట్రిబ్యునల్ విచారణకు హాజరవుతానని తెలిపారు.
ఆదివారం హైదరాబాద్‌లోని జలసౌధలో ఇరిగేషన్‌శాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్, సీనియర్అడ్వకేట్ సీఎస్ వైద్యనాథన్, ఇరిగేషన్ శాఖ అధికారులు, న్యాయ నిపుణులతో మంత్రి ఉత్తమ్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 5, 6న నిర్వహించిన మీటింగ్స్‌లో ట్రిబ్యునల్‌కు సమర్పించిన వాదనల వివరాలను ఆయనకు లీగల్టీమ్వివరించింది. అలాగే మన రాష్ట్ర డిమాండ్లు, ప్రస్తుత లీగల్స్టేటస్, ఈ నెల 15, 16, 17న జరగనున్న వాదనలకు సంబంధించిన ప్రిపరేషన్‌పై తెలియజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రం అనుసరించాల్సిన వ్యూహాలపై లీగల్ టీమ్, ఇరిగేషన్ శాఖ అధికారులకు మంత్రి ఉత్తమ్పలు సూచనలు చేశారు. న్యాయంగా, రాజ్యాంగబద్ధంగా, సాంకేతికంగా రాష్ట్రానికి రావాల్సిన వాటాపై ఆయన స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు.
మన వాటా మనకు దక్కాలి..
నీటి వాటాల విషయంలో రాష్ట్రానికి దశాబ్దాలుగా అన్యాయమే జరుగుతున్నదని మంత్రి ఉత్తమ్ఆవేదన వ్యక్తం చేశారు. తాము న్యాయం కోసం పోరాడుతున్నామని చెప్పారు. ‘‘రాష్ట్రానికి నీటి కేటాయింపుల్లో అన్యాయం జరుగుతున్నది. ఇది మన హక్కులకు సంబంధించిన విషయం. మనకు హక్కుగా రావాల్సిన నీటి వాటాల కోసం ప్రభుత్వం పోరాటం చేస్తున్నది. మన రాష్ట్ర హక్కులపై బలమైన వాదనలు వినిపించేందుకు అవసరమైతే స్వయంగా నేనే ట్రిబ్యునల్ విచారణకు హాజరవుతాను.
నీళ్ల పంచాదికి సంబంధించి ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయో వివరాలు ఇవ్వండి. ఇలాంటి విషయాలపై తరచూ నాకు సమాచారం ఇవ్వండి” అని అధికారులను ఆదేశించారు. లీగల్ టీమ్‌కు అవసరమైన సౌలతులపై ఆరా తీశారు. కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ట్రిబ్యునల్ 2 (కేడబ్ల్యూడీటీ2/బ్రజేశ్కుమార్ట్రిబ్యునల్) ముందు సమర్పించాల్సిన, అవసరమైన డాక్యుమెంట్ల గురించి చర్చించారు. ట్రిబ్యునల్ వర్క్, డేటా కూర్పు, క్షేత్రస్థాయి ఇన్‌పుట్స్, లీగల్ డ్రాఫ్టింగ్వంటి విషయాల్లో ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోబోదని చెప్పారు.