అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి : కలెక్టర్ సి.నారాయణరెడ్డి

నిజామాబాద్, వెలుగు: పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని నిజామాబాద్‌‌ కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మన ఊరు మన బడి కింద జిల్లా కేంద్రంలోని వెంగళ్‌‌రావు నగర్‌‌‌‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, వినాయక్ నగర్‌‌‌‌లోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో  పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కొత్త నిర్మించిన గదులు, కిచెన్, సంప్, ఫ్లోరింగ్, రెయిలింగ్, వాటర్ పైప్ లైన్ కనెక్షన్లు, విద్యుద్దీకరణ తదితర పనులను చెక్‌‌ చేశారు. ‌‌‌‌

పనుల్లో లోపాలను గుర్తించిన కలెక్టర్ వాటిని సరి చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీపడకూడదని, నాసిరకంగా పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెండింగ్‌‌లో ఉన్న పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఈఈ దేవిదాస్, డీఈ అంజిరెడ్డి, ఏఈ ఉదయ్‌‌కిరణ్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు భూమయ్య, గంగాధర్ ఉన్నారు.