మహిళా ప్రజాప్రతినిధులంటే.. అంత చులకన వద్దు

మహిళా ప్రజాప్రతినిధులంటే.. అంత చులకన వద్దు
  • అందులోనూ గ్రామీణ ప్రాంతాల విషయంలో ఇది సరికాదు: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: మహిళా ప్రజాప్రతినిధులను అంత చులకనగా చూడొద్దని మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. ప్రజల చేత ఎన్నికైన మహిళా ప్రజా ప్రతినిధిని పదవి నుంచి తొలగించడాన్ని అంత తేలికగా పరిగణించరాదని తెలిపింది. అందులోనూ.. గ్రామీణ ప్రాంతానికి చెందిన మహిళ విషయంలో ఇది సరికాదని అభిప్రాయపడింది. ఓ మహిళా సర్పంచ్​ను తొలగించాలన్న కలెక్టర్ ఆదేశాలను రద్దు చేస్తున్నట్లు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ బెంచ్ ప్రకటించింది. దీన్ని ఓ క్లాసిక్ కేసుగా పేర్కొన్నది. రాజ్యాంగబద్ధంగా సర్పంచ్ తన అధికారాన్ని వినియోగించుకుంటారని, గ్రామస్తులంతా ఆమె ఆదేశాలకు కట్టుబడి ఉండాలని సూచించింది. 

మహారాష్ట్ర జల్గావ్ జిల్లా విచ్​ఖేడా గ్రామపంచాయతీకి మనీశ్ రవీంద్ర పాన్​పాటిల్ సర్పంచ్ గా ఎన్నికైంది. గవర్నమెంట్ స్థలంలో నిర్మించిన ఇంట్లో ఆమె తన అత్తతో కలిసి నివాసం ఉంటున్నదని గ్రామస్తుల ఆరోపణ. దీనిపై వాళ్లంతా కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో డివిజనల్ కమిషనర్ ఆమెపై అనర్హత వేటేశారు. దీంతో ఆమె హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. 

అనర్హత వేటును హైకోర్టు సమర్థిస్తూ.. సాంకేతిక కారణాలతో పిటిషన్​ను కొట్టేసింది. దీంతో ఆమె సుప్రీం కోర్టుకు వెళ్లింది. తన భర్త, పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నట్లు పిటిషన్​లో ఆమె పేర్కొన్నది. దీనిని విచారించిన సుప్రీం బెంచ్.. ‘‘ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లో మహిళా సాధికారత కోసం దేశం మొత్తం పోరాడుతున్నది. ఇలాంటప్పుడు ఓ మహిళా సర్పంచ్​ను తొలగించడం సరికాదు’’అని తెలిపింది.