ఈవీఎంల్లో డేటాను తొలగించొద్దు.. ఈసీకి సుప్రీం కీలక ఆదేశాలు

ఈవీఎంల్లో డేటాను తొలగించొద్దు.. ఈసీకి సుప్రీం కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ: ఎన్నికల ఫలితాలు వెల్లడించాక ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఉన్న డేటాను తొలగించవద్దని ఎన్నికల సంఘాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశించింది. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత కూడా ఈవీఎంల్లో డేటాను వెరిఫికేషన్ చేసుకునే అవకాశం ఉండాలని, ఆ మేరకు ఎన్నికల సంఘానికి మార్గదర్శకాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ జరిపింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది.  ఏడీఆర్(అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్) ఈ పిటిషన్ను దాఖలు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం తరపున సీనియర్ అడ్వకెట్ మణీందర్ సింగ్ వాదనలు వినిపించారు.

ఏప్రిల్ 2024లో ఈవీఎం-వీవీప్యాట్ కేసులో వెల్లడించిన తీర్పు ప్రకారం.. ఈవీఎంల్లోని పోలింగ్ డేటాను తొలగించడం గానీ, రీలోడ్ చేయడం గానీ చేయకూడదని సీజేఐ సంజీవ్ ఖన్నా ఈసీ తరపు న్యాయవాదికి గుర్తుచేశారు. పోలింగ్ ముగిశాక.. ఫలితాలు వెల్లడయ్యాక.. ఫలితాలపై ఎవరైనా సందేహం వ్యక్తం చేస్తే.. ఈవీఎంల పనితీరుపై అనుమానం వ్యక్తం చేస్తే ఇబ్బందులు ఎదురవకుండా ఉండేందుకే డేటాను డిలీట్ చేయొద్దని ఆదేశాలు ఇస్తున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. అలా ఫలితాలపై అభ్యంతరం వ్యక్తమైన క్రమంలో.. ఈవీఎం మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇంజనీర్ ఈవీఎంల్లోని డేటాను వెరిఫై చేసి, చెక్ చేసి సందేహాలను నివృతి చేసే విధంగా ఉండాలని అభిప్రాయపడింది.

Also Read :- అత్యంత అవినీతి దేశాల లిస్ట్ విడుదల

బర్ట్న్ మెమొరీలో గానీ మైక్రో చిప్స్ స్టాక్ చేసిన డేటాలో గానీ ఎలాంటి ట్యాంపరింగ్ జరగనప్పుడు డేటాను డిలీట్ చేయాల్సిన అవసరం ఏముందని ఎన్నికల సంఘాన్ని సీజేఐ ప్రశ్నించారు. ‘‘డేటాను డిలీట్ చేయొద్దు.. డేటాను రీలోడ్ చేయొద్దు..’’ (Do not Erase the Data, Do not Reload the Data- all you need to do is somebody should come and verify, they have to examine") అని కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

అంతేకాకుండా.. ఈవీఎం వెరిఫికేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం రూ.40 వేలు ఫిక్స్ చేయడంపై కూడా సుప్రీం కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. రూ. 40 వేలు చాలా ఎక్కువని, ఈ మొత్తాన్ని కొంత తగ్గించాలని తెలిపింది. ఒక ఈవీఎం మెషిన్ ధరనే రూ.30 వేలకు మించి ఉండదని, అలాంటిది ఈవీఎం వెరిఫికేషన్ కోసం 40 వేలు వసూలు చేయడం ఏంటని సుప్రీం కోర్టు ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను మార్చి 3, 2025కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది.