వీఆర్వోల వ్యవస్థ రద్దు చేసిన ప్రభుత్వం.. ఆ బరువంతా పరోక్షంగా వీఆర్ఏలపైనే మోపింది. కింది స్థాయిలో కీలకంగా పనిచేస్తున్న వీఆర్ఏలకు పేస్కేల్అమలు చేస్తామని, ప్రమోషన్లు ఇస్తామనీ స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రే అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. ఆ మాట చెప్పి ఏండ్లు దాటినా అమలు కాలేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులతో కొందరు వీఆర్ఏలు ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారు. అయినా సర్కారు స్పందించకపోవడంతో వాళ్లంతా ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలె.
పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు తర్వాత గ్రామ స్థాయిలో ప్రభుత్వాలు ఇప్పటికీ ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను నిర్మించ లేదు. రాజ్యాంగ విలువల ప్రాతిపదికన గ్రామ స్థాయిలో ప్రజాస్వామిక పాలానా యంత్రాంగాన్ని నిర్మించే ప్రయత్నం జరగలేదు. రకరకాల ప్రయోగాలు చేస్తున్నాయి తప్ప ఒక స్థిర మైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం లేదు. ప్రయోగాల ఫలితంగానే గ్రామ స్థాయి ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్వారీల స్థానంలో వచ్చిన గ్రామ రెవెన్యూ ఆఫీసర్(వీఆర్వో) పోస్టు రద్దయింది.
ఆ వ్యవస్థను రద్దు చేస్తున్న సమయంలోనే గ్రామ రెవెన్యూ సహాయకు(వీఆర్ఏ) ల సర్వీసులను క్రమబద్ధీకరించి వారికి పే స్కేల్ వర్తింపజేస్తామని స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్శాసన సభలో ప్రకటించారు. ఆ ప్రకటన నేటికీ అమలులోకి రాలేదు. వారి సర్వీసుల విషయంలోనూ హామీ ఇచ్చినా, అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం వీఆర్ఏలు అడుగుతున్న దానిలో కొత్త విషయం ఏమీ లేదు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటనను అమలు చేయాలని మాత్రమే అడుగుతున్నారు. దాని కోసం జులై 25 నుంచి సమ్మె చేస్తున్నారు. అయినా సర్కారులో చలనం లేదు.
అసెంబ్లీలో ప్రకటించినా..
నిచ్చెన మెట్ల లాంటి ప్రభుత్వ పాలనా యంత్రాంగంలో ఆఖరి శ్రేణి వీఆర్ఏలు. వీరంతా నిజాం ఏలుబడిలో వెట్టికి బలైన ఉద్యోగులు. అధికారులకే కాదు, గ్రామ పెత్తందార్లకు కూడా ఊడిగం చేసేవాళ్లు. అప్పట్లో పని చేసినందుకు వారికి ఇనామ్ భూములు ఇచ్చేవారు. నామమాత్రంగానే గౌరవ వేతనం ఇచ్చేవారు. ఇనామ్ భూములు పోయాయి కానీ గౌరవ వేతనం పద్ధతి మాత్రం కొనసాగుతున్నది. వర్తమానంలోకి వస్తే 2017 దాకా వారికి 6500 రూపాయల గౌరవ వేతనం అందేది. ఆ సంవత్సరం ప్రభుత్వం గౌరవ వేతనాన్ని 10,500 రూపాయలు చేసింది. అర్హులైన వారిని క్రమబద్ధీకరించి స్కేల్ ఇస్తామని, ప్రమోషన్ అవకాశం కూడా ఇస్తామని ప్రభుత్వం మాట ఇచ్చింది. కానీ అది ఆచరణకు నొచుకో లేదు.
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న అశోక్ స్వగ్రామం బొల్లారంలో అతనితో పాటు అతని పాలొళ్లు కూడా ఆ ఉద్యోగానికి వారసత్వ హక్కును కలిగి ఉన్నారు. వారందరికీ 2015లో కొంతసొమ్ము చెల్లించి, అశోక్ వారి నుంచి ఉద్యోగంపై హక్కు పొందాడు. అయితే ఆయన దగ్గర తోటి హక్కుదారులకు కట్టడానికి కావాల్సిన సొమ్ము లేదు. అందుకు తనకు ఉన్న ఎకరం భూమిని, పశు సంపదను అమ్మాడు. అట్ల వచ్చిన నగదు చాలక పోవడంతో కొంత అప్పు కూడా చేయాల్సి వచ్చింది.
అశోక్ లాగే చాలా మంది వీఆర్ఏలు మెరుగైన జీతం వస్తుందన్న ఆశతో తోటి పాలొళ్లకు పైసలు కట్టి ఉద్యోగం కొనుక్కొని ఇప్పడు అప్పుల పాలయ్యారు. అంతకు మునుపు వ్యవసాయం, పశు పోషణ అశోక్ కుటుంబానికి ఏకైక ఆధారం. ఆయన ఉద్యోగంలో చేరిన తరువాత ఆయన నౌకరీ చేసి తెచ్చిన పైసలతో ఆ కుటుంబం గడిచేది. వచ్చే రూ. 10,500 జీతంలో, నిత్యం మండలాఫీసు వెళ్లడానికి, చాయనీళ్లకు కొంత ఖర్చయ్యేదని తెలుస్తున్నది.
మిగిలిన పైసలతో అప్పు కట్టి, కుటుంబాన్ని నడపాలంటే ఎంత కష్టమో ఊహించొచ్చు. కుటుంబ సభ్యులు కొంత ఆదాయం జోడించడానికి తమ ప్రయత్నం తాము చేస్తున్నారు. భూమి కౌలుకు తీసుకొని అందరూ కలిసి వ్యవసాయం చేస్తారు. కౌలు పైసలు పోను వ్యవసాయంలో మిగిలేది నామమాత్రమే. తమ పొలంలో పని లేనప్పుడు కూలికి కూడా పోతారు. కుటుంబం మొత్తం రెక్కల కష్టం చేసినా వచ్చే అదనపు ఆదాయం నామమాత్రమే. మాతో పాటు అశోక్ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన వీఆర్ఏలందరూ అశోక్ ఆర్థిక పరిస్థితికి, తమ ఆర్థిక పరిస్థితికి పెద్దగా తేడా లేదని వాపోయారు.
వెంటనే న్యాయం చేయాలె..
గ్రామానికి ప్రభుత్వానికి వారధులుగా విధులు నిర్వర్తించే వీఆర్ఏల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదలడం సరికాదు. నిత్యవసరాలతోపాటు అన్నింటి ధరలు పెరిగిన దృష్ట్యా, రూ.10,500తో కుటుంబాన్ని నెట్టుకురాలేక, ఆర్థిక ఇబ్బందులతో వీఆర్ఏలు చావు వెతుక్కుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి వేతనం తక్షణమే పెంచాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి, వెంటనే వారికి పే స్కేల్అమలు చేసి, అర్హతలను బట్టి ప్రమోషన్లు ఇయ్యాలె.
ఆత్మహత్యలు ఆగడం లేదు
హామీ ఇచ్చిన ప్రకారం ప్రభుత్వం పే స్కేల్అమలు చేయడం లేదని మొన్న శనివారం కామారెడ్డి జిల్లాలో వీఆర్ఏ అశోక్ఆత్మహత్య చేసుకుంటే, నిన్న నల్గొండ జిల్లా మిర్యాలగూడ దగ్గర మరో వీఆర్ఏ వెంకటేశ్వర్లు ప్రాణం తీసుకున్నాడు. కామారెడ్డి జిల్లాలో ఇయ్యాల ఇంకో వీఆర్ఏ రాగుల రవి బలవన్మరణం చెందాడు. ఈ ముగ్గురితోపాటు మరో 25 మంది చనిపోయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. అశోక్కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మేము అశోక్పరిస్థితితోపాటు వీఆర్ఏల జీవితాలు అర్థం చేసుకోగలిగినం. ఇంటర్ వరకు చదువుకున్న ఇరవై ఎనిమిదేండ్ల అశోక్, వీఆర్ఏ నౌకరి వారసత్వంగా పొందాడు.
కొంత కంప్యూటర్ పరిజ్ఞానం సంపాదించుకున్న అతను మండలాఫీసు పనుల్లోనూ చురుగ్గా పనిచేసేవాడు. పోటీ పరీక్షల ద్వారా ఎంపికైన కొద్ది మంది వీఆర్ఏలు తప్ప, అశోక్ మాదిరిగానే మొత్తం 23 వేల మంది కూడా వారసత్వంగా కొలువులు పొందినవారే. తొలుత పనిచేసిన వారు చనిపోయిన తరువాత ఆయన వారసులు వంతుల వారీగా పదవీ బాధ్యతలు నిర్వర్తించే వారు. ఇలా పదవిని తలా కొన్నేండ్లు చేయడాన్ని ఊటా బందీ పద్ధతి అంటారు. నిన్న మొన్నటి దాకా వీఆర్ఏలను స్థానికంగా ఒక్కోచోట ఒక్కో పేరుతో పిలిచేవారు. సుంకరి, తలారి, శేత్ సింధీ, కావలికార్, మస్కూరి వంటి పేర్లతో పిలిచేది. 2017లో అనుకుంట ప్రభుత్వం వారి పేరును వీఆర్ఏగా నామకరణం చేసి, అదే పేరుతో పిలువాలని ఉత్తర్వులు జారీ చేసింది. - ఎం. కోదండ రామ్, అధ్యక్షుడు, తెలంగాణ జన సమితి