అసెంబ్లీ క్వశ్చన్​ అవర్ లో ప్లకార్డులు ప్రదర్శించొద్దు: స్పీకర్ గడ్డం ప్రసాద్

అసెంబ్లీ క్వశ్చన్​ అవర్ లో ప్లకార్డులు ప్రదర్శించొద్దు: స్పీకర్ గడ్డం ప్రసాద్

సభలో ప్లకార్డులు ప్రదర్శించొద్దని సభ్యులకు స్పీకర్ గడ్డం ప్రసాద్ సూచించారు. సభ సజావుగా సాగించేందుకు సహకరించాలన్నారు. ‘‘అన్ని అంశాలపై చర్చించుకుందాం. ఎవరూ నినాదాలు చేయొద్దు. ప్లకార్డులతో నిరసన తెలియజేయొద్దు. సభా సంప్రదాయాలను గౌరవించాలి. నిబంధనలు పాటిస్తేనే సభ సజావుగా సాగుతది. సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు బాధ్యులు సమాధానం చెప్తారు. సంయమనం పాటించాలి’’అని స్పీకర్ ప్రసాద్ కోరారు.

ధరణి పేరు మారిస్తే సరిపోదు: ఎమ్మెల్యే పాయల్ శంకర్

ధరణితో ప్రజలు చాలా ఇ బ్బందులు పడ్డారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిని భూ భార తిగా పేరు మార్చింది. కానీ.. సమస్యలు మాత్రమే అలాగే ఉన్నయ్. పేర్లు మారిస్తే సరిపోదు. భూ సమస్యలకు పరిష్కారం చూపాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి చేయొద్దు. ధరణిలో ఎన్నో లోపాలున్నయ్. వాటన్నింటినీ సవరించాలి. గ్రామాల్లో వీఆర్ఏ వ్యవస్థను బలోపేతం చేయాలి’’అని శంకర్ కోరారు.

బీఆర్ఎస్​ డ్రామాలు చేయొద్దు: ఎమ్మెల్యే మందుల సామేల్

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రోజుకో వేషం వేసుకుని వస్తున్నరని కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ ఫైర్ అయ్యారు. డ్రామాలు వేస్తూ సభా సమాయాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారం.. చిందు కళాకారులు భాగవతాలను తలపిస్తున్నది. పదేండ్లు అధికారంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు భూ దందాలు, ఇసుక దందాలు చేసిన్రు. రాష్ట్రాన్ని మొత్తం దోచుకున్నరు’’అని సామేల్ విమర్శించారు.

పట్టా భూములు గుంజుకున్నది: ఎమ్మెల్యే కవ్వంపల్లి

తన నియోజకవర్గంలో 1973లో రైతులకు పట్టాలు ఇచ్చారని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, వైకుంఠ ధామాల కోసం గుంజుకున్నదని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆరోపించారు. ఆ రైతులకు న్యాయం చేయాలని కోరారు.