కరోనా లక్షణాలతో మరణించినోళ్లపై నిర్ణయం
వారిని వైరస్ పాజిటివ్‌గానే భావించాలని ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: కరోనా లక్షణాలతో మరణించిన వారికి వైరస్ టెస్టులు చేయించొద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లకు, దవాఖానాల సూపరింటెండెంట్లకు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. మృతదేహాల నుంచి కరోనా టెస్టుల కోసం శాంపిల్స్ సేకరించవద్దని స్పష్టం చేశారు. కరోనా లక్షణాలతో చనిపోతే ‘కరోనా పాజిటివ్ (డీమ్డ్ టు బీ పాజిటివ్)’గానే భావించాలని సూచించారు. కరోనా మృతుల అంత్యక్రియలకు పాటించిన గైడ్‌లైన్స్‌నే వాళ్లకూ వర్తింపజేయనున్నారు. తర్వాత సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు, సన్నిహితులను క్వారంటైన్‌చేసి టెస్టులు చేయాలని సర్కారు నిర్ణయించింది. అందులో ఎవరికైనా పాజిటివ్ వస్తే ఆ మరణాన్ని కరోనా మృతుల జాబితాలో కలపాలని భావిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 21 మంది చనిపోయారు. అందులో సుమారు పది మందికి మరణించాక చేసిన టెస్టుల్లోనే పాజిటివ్‌గా తేలింది. తర్వాత వారి కుటుంబ సభ్యులకు టెస్టులు
చేస్తే.. పాజిటివ్ గా బయటపడింది. హైదరాబాద్ పాతబస్తీలో ఓ మహిళ మరణించాక చేసిన టెస్టుల్లో కరోనా ఉన్నట్టు తేలింది. ఆమె కుటుంబ సభ్యుల్లో ఏకంగా 13 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. ఇలాంటి పరిస్థితులు ఉన్న సమయంలో.. చనిపోయినవాళ్లకు టెస్టులు చేయొద్దన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న దానిపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు.
For More News..