భోజనానికి ముందు, తర్వాత..టీ, కాఫీలు తాగొద్దు

భోజనానికి ముందు, తర్వాత..టీ, కాఫీలు తాగొద్దు
  •      ఐసీఎంఆర్ సైంటిస్టుల హెచ్చరిక
  •     దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తయ్
  •     ఫుడ్​లోని ఐరన్ శాతాన్ని కాఫీలోని టానిన్లు తగ్గిస్తయ్

న్యూఢిల్లీ:  టీ, కాఫీలను మితంగానే తాగాలని, అదేపనిగా తాగడం అనారోగ్యానికి కారణమవుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) సైంటిస్టులు హెచ్చరించారు. దేశమంతటా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించాలనే లక్ష్యంతో నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్)తో కలిసి ఐసీఎంఆర్ ఇటీవల కొత్త డైట్ గైడ్​లైన్స్​ను విడుదల చేసింది. వివిధ రకాల ఆహారపు అలవాట్లు.. హెల్తీ లైఫ్ స్టైల్​కు ఎంతో కీలకమని చెప్పింది. తామిచ్చిన డైట్ గైడ్​లైన్స్​ను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించింది.

ఇందులో టీ, కాఫీల వల్ల కలిగే ఆరోగ్యపరమైన ఇబ్బందుల గురించి వివరించింది. ‘‘టీ, కాఫీలో కెఫిన్ ఉంటుంది. ఇది మన కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఈ పానీయాలు తాగిన తర్వాత రిఫ్రెష్  అయిన ఫీలింగ్​వస్తుంది. ఇది కొంత వరకు నిజమే అయినా.. అదేపనిగా టీ, కాఫీలు తాగితే వాటి ద్వారా శరీరంలోకి చేరే కెఫిన్ మన నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తది.

150 మిల్లీ లీటర్ల కాఫీలో 80 నుంచి 120 మిల్లీ గ్రాముల కెఫిన్ ఉంటుంది. ఇన్​స్టంట్ కాఫీలో 50 నుంచి 60 మిల్లీ గ్రాములు, టీలో 30 నుంచి 65 మిల్లీ గ్రాముల కెఫిన్ ఉంటుంది. రోజుకు కేవలం 300 మిల్లీ గ్రాముల కెఫిన్ తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. మోతాదు దాటితే ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి’’ అని ఐసీఎంఆర్ హెచ్చరించింది.

గుండె జబ్బుల ముప్పు కూడా..

అన్నం తినే గంట ముందు, తిన్నంక గంట దాకా టీ, కాఫీలు తాగొద్దని ఐసీఎంఆర్ సూచించింది. ఇండియాలో చాలామంది టీ లేదా కాఫీలను భోజనానికి ముందు లేదా తర్వాత తీసుకుంటారని తెలిపింది. ఇలా చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించింది. ‘కాఫీ, టీలో టానిన్లు ఉంటాయి. ఇవి ఆహారంలోని ఐరన్ ను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. జీర్ణాశయంలోకి చేరిన ఆహారంలోని ఐరన్ తో టానిన్ చర్య జరిపి, రక్తంలోకి చేరకుండా అడ్డుపడుతుంది. దీంతో బాడీలో ఐరన్ సమతుల్యత దెబ్బతింటది. బాడీలో ఐరన్ శాతం సరైన మోతాదులో ఉండాలి. ఐరన్ తక్కువైతే రక్తహీనత సహా పలు సమస్యలు చుట్టుముడతాయి’’ అని ఐసీఎంఆర్ వివరించింది. 

హిమోగ్లోబిన్ తయారీపై ప్రభావం

శరీరమంతా ఆక్సిజన్​ను తీసుకెళ్లే ఎర్ర రక్త కణాల్లోని హిమోగ్లోబిన్ అనే ప్రొటీన్​ను తయారవ్వడానికి ఐరన్ చాలా అవసరం. బాడీలో ఐరన్ లోపిస్తే.. తరుచూ అలసిపోవడం లేదా శక్తి లేకపోవడం, ఊపిరి ఆడకపోవడం, తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. ప్రత్యేకించి బలహీనత, గుండె వేగంగా కొట్టుకోవడం, గోర్లు పెలుసుగా మారిపోవడం లేదంటే జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. అయితే, పాలు లేకుండా టీ తాగడంతో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కరోనరీ ఆర్టరీ డిసీజ్, స్టమక్  క్యాన్సర్ రిస్క్​లు తగ్గుతాయని ఐసీఎంఆర్ తన గైడ్​లైన్స్​లో పేర్కొంది.