ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీని కొట్టేసిన ఫెడరల్ కోర్టు
ఒబామా తెచ్చిన డీఏసీఏ పాలసీని అమలు చేయాలని ఆదేశం
వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సర్కార్ తెచ్చిన మరో పాలసీని ఓ ఫెడరల్ కోర్టు కొట్టేసింది. డాక్యుమెంట్లు లేకుండా బాల్యంలోనే అమెరికా వచ్చిన ఇండియన్లు, ఇతర ఇమిగ్రెంట్లను డీపోర్టేషన్ (దేశ బహిష్కరణ) చేయకుండా రక్షణ కల్పించాలని ఆదేశించింది. ఇందుకోసం బరాక్ ఒబామా హయాంలో తెచ్చిన ‘డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్ హుడ్ అరైవల్స్ (డీఏసీఏ) ప్రోగ్రామ్’ను తిరిగి అమలు చేయాలని శుక్రవారం న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ (ఫెడరల్ కోర్ట్) జడ్జి నికోలస్ గరౌఫిస్ స్పష్టం చేశారు. డీఏసీఏ రిసీపియెంట్స్ కు రెండేళ్ల పాటు రెన్యువల్స్ చేయాలని, ఈ ప్రోగ్రాంలో చేరేందుకు కొత్తవారి నుంచి సోమవారం అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభించాలని డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీని జడ్జి ఆదేశించారు. దీంతో 2017 తర్వాత డీఏసీఏకు అర్హత సాధించని వారు మళ్లీ అప్లై చేసుకునేందుకు చాన్స్ దొరకనుంది. కాగా సరైన డాక్యుమెంట్లు లేకుండా బాల్యంలోనే అమెరికాలోకి వచ్చిన చైల్డ్ ఇమిగ్రెంట్లను డీపోర్టేషన్ చేయకుండా ఉండేందుకు, వారి కోసం ఒబామా హయాంలో ప్రత్యేక ప్రోగ్రాంను ప్రారంభించారు. ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక, 2017లో డీఏసీఏ ప్రోగ్రామ్ను రద్దు చేయాలని నిర్ణయించారు. అయితే ట్రంప్ నిర్ణయంపై సుప్రీంకోర్ట్ ఈ ఏడాది జూన్లో స్టే ఇచ్చింది. తాజాగా ఫెడరల్ కోర్ట్ ట్రంప్ నిర్ణయాన్ని కొట్టేసింది.
అక్రమంగా 6.30 లక్షల మంది ఇండియన్లు..
డీఏసీఏ రిసీపియెంట్లను ‘డ్రీమర్స్’గా పిలుస్తుంటారు. మర్డర్, ఇతర సీరియస్ నేరాలు చేసిన చరిత్ర లేని అక్రమ ఇమిగ్రెంట్లకు మాత్రమే ఈ ప్రోగ్రాంలో చేరే చాన్స్ ఉంటుంది. ఇప్పటివరకు డీఏసీఏ ప్రోగ్రాంలో 6.40 లక్షల మంది ఇమిగ్రెంట్లు పేర్లు నమోదు చేసుకున్నారు. ఇక 2019 నాటి ఓ రిపోర్ట్ ప్రకారం.. అమెరికాలో 6.30 లక్షల మంది ఇండియన్లు అక్రమంగా (సరైన డాక్యుమెంట్లు లేకుండా) ఉన్నారని, 2010 నుంచి వీరి సంఖ్య 72% పెరిగిందని అంచనా.
వ్యాక్సిన్ కంపల్సరి కాదు
అమెరికన్లు అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని, మాస్క్ లు పెట్టుకోవాలని తాము తప్పనిసరి చేయబోమని ప్రెసిడెంట్ ఎలక్ట్ జో బైడెన్ చెప్పారు. శుక్రవారం విల్మింగ్టన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. వంద రోజుల పాటు మాస్క్ ల వాడకంతో పాటు వ్యాక్సిన్లను తప్పనిసరి మాత్రం చేయబోమన్నారు. అయితే వ్యాక్సిన్లను ఫ్రీగా ఇస్తామని, వాటి వల్ల ఆరోగ్య సమస్యలు వస్తే వాటి వైద్య సేవల ఖర్చూ తమ ప్రభుత్వమే భరిస్తుందన్నారు.
అధికారికంగా 279 ఓట్లు..
ప్రెసిడెంట్ ఎన్నికల్లో గెలిచిన బైడెన్ కు అఫీషియల్ గా 279 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు దక్కాయి. శుక్రవారం కాలిఫోర్నియా స్టేట్ ఎలక్షన్ రిజల్ట్ ను అధికారికంగా సర్టిఫై చేసింది. ఇక్కడ బైడెన్ గెలవడంతో 55 ఎలక్టోరల్ ఓట్లు పొందారు. దీంతో అఫీషియల్ గా మ్యాజిక్ ఫిగర్ 270 కంటే 9 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అయితే ఈ నెల14న ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నికల్లో బైడెన్ ను అధికారికంగా ప్రెసిడెంట్గా ప్రకటించనున్నారు.
For More News..