సమ్మక్క వచ్చే టైంలో ఇబ్బందులు కలుగొద్దు : కలెక్టర్‌‌ ఇలా త్రిపాఠి

తాడ్వాయి, వెలుగు : సమ్మక్కను తీసుకువచ్చే టైంలో ఇబ్బందులు కలగకుండా చూడాలని ములుగు కలెక్టర్‌‌ ఇలా త్రిపాఠి ఆదేశించారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, ఈవో రాజేంద్రతో కలిసి శనివారం చిలుకలగుట్టను సందర్శించారు. ఈ సందర్భంగా సమ్మక్కను ఎక్కడి నుంచి తీసుకువస్తారు, మొక్కులు ఎక్కడ సమర్పిస్తారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కలెక్టర్‌‌ మాట్లాడుతూ అమ్మవారిని తీసుకువచ్చే టైంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, చిలుకలగుట్ట ప్రాంతంలో రద్దీని నియంత్రించాలని పోలీసులను ఆదేశించారు. అంతకుముందు ఐటీడీఏ క్యాంప్‌‌ ఆఫీస్‌‌లో ఆర్‌‌డబ్ల్యూఎస్‌‌ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. మేడారం జాతర టైంలో ఆఫీసర్లు అందుబాటులో ఉండాలని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. నిరంతరం తాగునీరు, టాయిలెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆమె వెంట ఆర్డీవో సత్యపాల్‌‌రెడ్డి, తహసీల్దార్‌‌ తోట రవీందర్‌‌ పాల్గొన్నారు.