వ్యాక్సిన్​ వేయించుకున్నాక ఏం తినొచ్చు?

కరోనా వచ్చినప్పుడు ఎన్ని అనుమానాలో? ఇప్పుడు వ్యాక్సిన్​ మీద అన్ని అనుమానాలున్నాయి. వీళ్లు తీసుకోవచ్చు, వాళ్లు తీసుకోకూడదంటూ రకరకాల ప్రచారాలు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వ్యాక్సిన్​ మంచిది. ఆ వ్యాక్సిన్​ పనిచేయదు.. అని, వ్యాక్సిన్​తోనీ కొవిడ్​ రావచ్చనే పుకార్లు ఎన్నో? ఒక్క వ్యాక్సిన్​ చుట్టూ ఎన్నో సందేహాలు, భయంతో కూడా వ్యాక్సిన్​కి దూరంగా ఉన్నారెందరో. ప్రచారాలు నిజమేనా? వ్యాక్సిన్​ ఎలా పనిచేస్తోంది? ఎవరికి అవసరమో చెబుతున్నారు డాక్టర్​ రవి కిరణ్​ బరిగల. 

వ్యాక్సిన్​పై అందరికీ రకరకాల సందేహాలున్నాయి. చాలా రకాల సందేహాలతోపాటు భయం కూడా ఉంది. కానీ అలాంటి భయాలేమీ పెట్టుకోనక్కర్లేదు. బీపీ, షుగర్, క్యాన్సర్​, హార్ట్​ ప్రాబ్లమ్​, హెచ్​ఐవీ, అవయవ మార్పిడి చేయించుకున్నవాళ్లు కోవిడ్ వ్యాక్సిన్​ తీసుకోవచ్చు. ​ ట్రాన్స్​ప్లాంట్​ పేషెంట్స్​ కూడా వేయించుకోవచ్చు. సాధారణ వ్యక్తుల కన్నా ఇలాంటి వాళ్లకే  వ్యాక్సిన్​ ఎక్కువ అవసరం. వీళ్లే అందరికన్నా ముందు తీసుకోవాలి. కొవిడ్​ వ్యాక్సిన్​కి తట్టుకుంటామో? లేదో? అన్న సందేహంతో 30 శాతం మంది వ్యాక్సినేషన్​కి దూరంగా ఉన్నారు. అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్లు కొవిడ్​ వ్యాక్సిన్​ తీసుకోవచ్చు. మందులు వాడుతుంటే ఆ మందులు ఆపాల్సిన అవసరం కూడా లేదు. వ్యాక్సిన్​ తీసుకుని, మెడిసిన్స్​ని కంటిన్యూగా వాడొచ్చు. డాక్టర్​ సలహా కూడా అవసరం లేదు. కొంతమంది రక్త సమస్యలతో మందులు వాడుతూ ఉంటారు. రక్తం పలుచబడే మందులు వాడుతున్న వాళ్లు కూడా కొవిడ్​ వ్యాక్సిన్ తీసు కోవచ్చు. వ్యాక్సిన్​ తీసుకున్న తర్వాత కూడా ఆ మందులు రెగ్యులర్​గా వాడొచ్చు. గర్భవతులు మాత్రమే కొవిడ్​ వ్యాక్సిన్​ తీసుకోకూడదు.  కొవిడ్​ వ్యాక్సిన్​ తీసుకుంటే కొవిడ్​19 బారిన పడే ప్రమాదం ఉంటుందని వాట్సాప్​, ఫేస్​బుక్​ పోస్టులు చదివి కొందరు నమ్ముతున్నారు. ఆ డౌట్ వల్లే చాలామంది వ్యాక్సినేషన్​కి దూరంగా ఉన్నారు. వ్యాక్సిన్​ తీసుకుంటే కోవిడ్ ​రాదు. కానీ కొన్ని సైడ్​ ఎఫెక్ట్స్ ఉంటాయి. జ్వరం, తలనొప్పి లాంటి సాధారణ సమస్యలే ఉంటాయి. కానీ తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావు. కొవిడ్​ ప్రమాదం ముందు ఈ సమస్యలు చిన్నవి. కాబట్టి భయపడకుండా వ్యాక్సిన్​ తీసుకోవాలి. 

ఇది తినాలనేం లేదు 

‘వ్యాక్సిన్​ తీసుకున్నాక యాంటీబాడీస్​ పెరగాలంటే ఎలాంటి వ్యాయామాలు చేయాలి? ఏమి తినాలి?’ అని చాలా మంది ఆలోచిస్తున్నారు. యాంటీబాడీస్ కోసం ప్రత్యేకంగా తినాల్సినవంటూ ఏదీ లేదు. అన్నీ తినాలి. తినొచ్చు. అలాగే వ్యాయామాలు చేస్తే పెరుగుతుందని లేదు. కానీ, ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం సాయపడుతుంది. 

వ్యాక్సిన్​ పనితీరు ఎంత?

వ్యాక్సిన్​ తీసుకున్నవాళ్లు కొవిడ్​ బారినపడితే వ్యాక్సిన్​ పనిచేయనట్లు కాదు. వ్యాక్సిన్​ సెకండ్​ డోస్​ తీసుకున్న రెండు వారాల తర్వాత ఇమ్యూనిటీ వస్తుంది. ఈ లోగా కరోనా బారినపడొచ్చు. కాబట్టి వ్యాక్సిన్​ పనిచేయట్లేదని అనుకోవద్దు.  వ్యాక్సిన్​ తీసుకుంటే కోవిడ్​ రాదని నూటికి నూరు పాళ్లు హామీ ఇవ్వలేము. కానీ, కొవిడ్​ బారినపడి హాస్పిటల్​లో చేరిన పేషెంట్స్​లో వ్యాక్సిన్​ తీసుకున్నవాళ్లు చాలా తక్కువమంది ఉన్నారు. వ్యాక్సిన్​ కరోనా బారిన పడకుండా కాపాడుతుంది. కొంత మందిలో వ్యాక్సిన్​ తీసుకున్న తర్వాత తగినన్ని యాంటీబాడీస్​ బాడీలో తయారు కాకపోవడం, తయారైన యాంటీ బాడీస్​ ఎక్కువకాలం ఉండకపోవడం వల్ల వ్యాక్సిన్​ తీసుకున్నా కొవిడ్​ బారినపడ్డారు. వ్యాక్సిన్​ తీసుకున్న వాళ్లలో 99 శాతం మంది సేఫ్​గా ఉన్నారు. ఒకరిద్దరి సంగతి ఆలోచిస్తూ లక్షల మంది సేఫ్​గా ఉన్న విషయాన్ని మరచిపోవద్దు.

వ్యాక్సిన్​ తీసుకున్నాక కొవిడ్​ వస్తే..  

ఇప్పుడు కొవిడ్​ రోగుల లెక్కలను బట్టి చూస్తే వ్యాక్సిన్​ చాలామందిని కొవిడ్ ​బారినపడకుండా కాపాడింది. కొవిడ్​ బారినపడి, హాస్పిటల్​లో చేరాల్సి వచ్చిన వాళ్లలో 99 శాతం మంది వ్యాక్సిన్​ తీసుకోని వాళ్లే ఉన్నారిప్పుడు. ఒకవేళ కొవిడ్​ వచ్చినా ప్రాణాపాయ పరిస్థితి రాకుండా చేసింది వ్యాక్సిన్. ​వ్యాక్సిన్​ తీసుకున్నవాళ్లు కొవిడ్​ బారిన పడినా  తొందరగా కోలుకోవడానికి అవకాశం ఉంది. వ్యాక్సిన్​ తీసుకున్నవాళ్లలో తీవ్రమైన సమస్యలు లేవు. తీవ్రమైన జ్వరం, ఆయాసం రావట్లేదు. అంటే వ్యాక్సిన్​ లైఫ్​ని సేవ్​ చేస్తున్నట్లే కదా.  సింగిల్​ డోస్​ తీసుకున్న కొవిడ్​ పేషెంట్స్​కి 50 శాతం ప్రొటక్షన్,​ ​ వ్యాక్సిన్​​ ఉత్పత్తి చేసిన యాంటీ బాడీస్​ వల్ల దొరుకుతుంది. డబుల్​ డోస్​ తీసుకున్న వారికి 99శాతం ప్రొటక్షన్​ ఉంటుంది. సింగిల్ డోస్​ తీసుకున్న వాళ్లు కూడా కోవిడ్​ బారినుంచి 3-–4 రోజుల్లోనే కోలుకున్నారు. కాబట్టి వ్యాక్సిన్​ మీద అనుమానా లొద్దు. అందరూ వ్యాక్సిన్​ తీసుకోవచ్చు. 

ఒక్కడోసుకే ఆపేస్తే..

ఫస్ట్ డోస్​ తీసుకున్నవాళ్లలో 30 శాతం మంది సెకండ్​ డోస్​కి రావట్లేదు. ఫస్ట్ డోస్​ తీసుకున్నప్పుడు జ్వరం, వళ్లు నొప్పులు, తలనొప్పి వస్తున్నాయి. ఈ భయంతో సెకండ్​ డోస్​కి రావట్లేదు. కరోనా రాకుండా ఇంటిపట్టునే ఉందాం అనుకుంటున్నారు. వృద్ధులు ఇంటి పట్టునే ఉన్నా పిల్లలు అటూ ఇటూ తిరిగి వస్తారు. వాళ్ల ద్వారా కరోనా సోకే ప్రమాదం ఉంది. కాబట్టి వ్యాక్సిన్​ రెండు డోసులూ తీసుకోవాలి.

యాంటీ బాడీస్ లైఫ్​ టైమ్​

వ్యాక్సిన్ తీసుకున్నాక ఎంతకాలం వరకు కొవిడ్​ బారిన పడరో ఇప్పటికైతే తెలియదు. యాంటీ బాడీస్​ ఎంతకాలం బాడీలో ఉంటాయో అప్పటి వరకు కొవిడ్​ బారినపడరు. కాకపోతే కరోనా వైరస్​, కొవిడ్​ వ్యాక్సిన్​ ఈ మధ్యనే వచ్చాయి. కాబట్టి వీటిమీద స్టడీ జరగలేదు. తగ్గితే మాత్రం బూస్టర్​ డోస్​ (మరోసారి వ్యాక్సిన్​) తీసుకోవాలి. బూస్టర్ డోస్​ అవసరమా? లేదా అనేది తర్వాత పరిశోధనల ఆధారంగా చెబుతారు. ఈ మహమ్మారిని దాటడానికి మాత్రం ఇప్పుడీ వ్యాక్సిన్​ సాయపడుతుంది. 

ఏ వ్యాక్సిన్​ మంచిది?

పద్దెనిమిదేళ్లు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్​ తీసుకోవాలి. కో–వ్యాగ్జిన్​ కావాలని, కోవిషీల్డ్​ కావాలని, విదేశాల నుంచి ఇంకేదో వస్తుందని అనుకోవద్దు. ఫలానా వ్యాక్సినే కావాలని ఎదురు చూస్తే నష్టపోతారు. రెండింటితో కూడా ప్రొటక్షన్​ కనిపిస్తోంది. ఇప్పుడు లక్షల మంది సేవ్​ అయ్యారు. కాబట్టి ఏ వ్యాక్సిన్​ అందుబాటులో ఉంటే అది తీసుకోండి.  
డాక్టర్ రవి కిరణ్​ బరిగల, ఇన్ఫెక్షన్​  డిసీజ్​ స్పెషలిస్ట్​, అపోలో హాస్పిటల్​, హైదరాబాద్​ 

పీరియడ్స్​ ఉన్నా వేయించుకోవచ్చు

18 ఏండ్లు పైబడిన వారికి మే 1 నుంచి టీకా అని కేంద్రం ప్రకటించినప్పటి నుంచి టీకాపై చాలా వార్తలు సర్క్యులేట్‌ అవుతున్నాయి. దాంట్లో అమ్మాయిల పీరియడ్స్‌‌కు సంబంధించిన న్యూస్‌‌ ఒకటి. పీరియడ్స్‌‌లో ఉన్న అమ్మాయిలు టీకా తీసుకోవద్దని, ఇమ్యూనిటీ పోతుందనేది ఆ మెసేజ్‌‌ సారాంశం. పీరియడ్ వచ్చే ముందు రోజు, పీరియడ్‌‌లో ఉన్నప్పుడు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ప్రికాషన్స్ ఏమీ అవసరం లేదు. ఎవరికి ప్రాబ్లమ్ రాలేదు. ఏదైనా సమస్య ఉండి మందులు వాడేవాళ్ళు కూడా నిర్భయంగా తీసుకోవచ్చు.

పుకార్లు సైన్స్ కాదు 

వాట్సాప్​, టీవీల్లో వచ్చే వార్తలు చూసి భయపడొద్దు. డాక్టర్లు, నర్సులు ఈ వ్యాక్సిన్​ తీసుకున్నారు. ఆరోగ్యంగా ఉన్నారని తెలుసుకోండి. కొవిడ్​ నుంచి బయటపడే మార్గం ఇది. కొవిడ్​కు మందు లేదు. లేని మందు కోసం పాట్లుపడుతూ తిరిగే కంటే వ్యాక్సిన్​ తీసుకోవడం మంచిది. ఉన్న అవకాశం ఒక్కటే. వ్యాక్సిన్​.