బ్రిటీష్ బానిస సంకెళ్లు తెంచుకొని 1947 ఆగస్టు 15న ఇండియా స్వాతంత్ర్య వేడుకలు జరుపుకున్నప్పటికీ.. ప్రస్తుత తెలంగాణ, నాటి హైదరాబాద్ సంస్థానం మాత్రం చీకట్లోనే మగ్గిపోయింది. నిజాం నిరంకుశ పాలనలో ఇక్కడి ప్రజలు దుర్భరమైన జీవితాన్ని కొనసాగించారు. సామూహిక హత్యలు, దోపిడీలు, మానభంగాలు, ఆడవాళ్లను నగ్నంగా బతుకమ్మలాడించి రజాకార్లు పైశాచిక ఆనందాన్ని పొందారు. ఊర్లపై పడి దోచుకొని, ఆడపిల్లలను ఎత్తుకపోయి, అన్యాయాలపై పోరాటం చేస్తున్న ప్రజలను దారుణంగా కాల్చి చంపారు. జలియన్ వాలా బాగ్‌ను తలపించే రీతిలో పరకాల, వీరభైరాన్‌పల్లి, కూటిగల్‌లో ప్రజలపై ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపి వందలాది మందిని పొట్టన పెట్టుకున్నారు. నాటి అమరుల త్యాగాలను స్మరించుకోవడానికి మహారాష్ట్ర మాజీ గవర్నర్ సి.హెచ్.విద్యాసాగర్ రావు పరకాలలో అమరధామం కట్టించారు. ఇలాంటి ప్రతీకలు నాటి వీరత్వానికి, త్యాగాలకు తెలంగాణ పల్లెల్లో నేటికీ సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
నాడు నిలదీసి.. నేడు మాటమార్చి
రజాకార్ల దాడులతో ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించారు. బాధలు పడలేక మర్లవడి కత్తులు, కటార్లు, బరిసెలు, గడ్డపారలు, తుపాకులు, కారంపొడిని సైతం ఆయుధంగా చేసుకొని పోరాడారు. కుమ్రం భీమ్ మొదలుకొని చాకలి అయిలమ్మ, దొడ్డి కొమురయ్య, షోయాబుల్లా ఖాన్, రామానంద తీర్ధ, వందేమాతరం రాంచందర్ రావు వంటి ఎందరో త్యాగధనులు నిజాం అరాచకాలపై ఉద్యమించారు. ‘మా నిజాం నవాబు తరతరాల బూజు’ అంటూ మహాకవి దాశరథి పద్యాలు, పదునైన పదాల తూటాలు ఎక్కుపెట్టారు. యావత్ తెలంగాణ ప్రజల వీరత్వానికి, నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ ధీరత్వం తోడవడంతో 1948 సెప్టెంబర్ 17 నాడు చీకటి పాలనలో మగ్గిన తెలంగాణలో వెలుగు రేఖలు విరజిమ్మాయి. ఇక్కడి ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చింది. త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాల నుంచి విముక్తి కలిగింది. ఈ ప్రాంతానికి స్వాతంత్ర్యం వచ్చిన సెప్టెంబర్ 17.. వాడవాడలా మూడు రంగుల జెండా ఎగరేసి పండుగ జరుపుకోవాల్సిన రోజు. కానీ ఓటు బ్యాంకు రాజకీయాలతో, రజాకార్ల వారసులైన మజ్లిస్ పార్టీ మద్దతు కోసం కక్కుర్తి పడిన పాలకులు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పట్టించుకుంటలేరు. ఉద్యమం టైమ్‌లో తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవం ఎందుకు జరపరంటూ నాటి సీఎం రోశయ్యను నిలదీసిన కేసీఆర్, ఈ రోజు మాటమార్చి, తెలంగాణ ప్రజలను వంచించి, 17 సెప్టెంబర్ స్వాతంత్య్ర వేడుకలు జరిపేది లేదని మొండికేస్తున్నారు.
మజ్లిస్ మద్దతు కోసమే
విమోచన దినోత్సవం అధికారికంగా జరపాలని బీజేపీ 21 ఏండ్లుగా పోరాడుతోంది. సెప్టెంబర్ 17న స్వాతంత్య్ర దినోత్సవం జరిపి నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన వీరులను, స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవాలని, వారి పోరాట చరిత్రను భావితరాలకు, ప్రపంచానికి చాటి చెప్పాలనే డిమాండ్‌తో రెండేండ్ల కింద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో వారం రోజులపాటు యాత్రను నిర్వహించాను. తెలంగాణ ప్రజలను, సబ్బండ వర్గాలను ఏకం చేశాను. అయినా మజ్లిస్ ఓట్ల మత్తులో తూలుతున్న టీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోవడం లేదు. టీఆర్ఎస్ సర్కార్ తెలంగాణ స్వాతంత్ర్య దినాన్ని అధికారికంగా జరపకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఉమ్మడి ఏపీలో తెలంగాణ చరిత్రను మరుగున పడేసిన.. కాంగ్రెస్ పార్టీ బాటలో నడిస్తే, ఆ పార్టీకి పట్టిన గతే టీఆర్ఎస్‌కు పడుతుంది.
పార్టీలకు కావాలె.. సర్కార్‌కు వద్దు
విచిత్రమేమిటంటే.. అన్ని పార్టీలు పార్టీ పరంగా విమోచన దినోత్సవాలు జరుపుతున్నాయి. దీన్ని పార్టీ ఆఫీస్‌లకే పరిమితం చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చాక మాత్రం ప్రభుత్వ పరంగా జరపడం లేదు. కేవలం మజ్లిస్ భయానికి తలొగ్గే ఇలా చేస్తున్నారు. వీరి అవకాశవాద, రెండు నాల్కల రాజకీయాలను తెలంగాణ సమాజం గమనిస్తున్నది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే సెప్టెంబర్ 17న స్వాతంత్ర్య దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవడం సాధ్యం అవుతుంది. తెలంగాణ ప్రజలరా ఆలోచించండి, కలసిరండి, మన ఆత్మగౌరవాన్ని కాపాడుదాం. నాటి సమరయోధుల స్ఫూర్తి మన తరువాతి తరాలకు తెలియజేద్దాం, ఒక భవ్యమైన స్థూపం “స్టాట్యు ఆఫ్ లిబరేషన్” హైదరాబాద్’ సిటీ నడిబొడ్డున నిర్మించుకుందాం.
– డా.కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు