హైదరాబాద్: విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం (జనవరి 27) సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న విజయ సాయి రెడ్డి 2025, ఫిబ్రవరి 10 నుంచి మార్చి10 వరకు ఫ్రాన్స్, నార్వే వెళ్లేందుకు న్యాయస్థానాన్ని అనుమతి కోరాడు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరగ్గా.. సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. విజయ సాయి రెడ్డి విదేశీ పర్యటనపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది.
జగన్ అక్రమాస్తుల కేసులపై రోజువారి విచారణ నేపథ్యంలో విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ న్యాయస్థానాన్ని కోరింది. ట్రయల్ కోర్ట్ గతంలో విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చిన విజయ సాయి రెడ్డి తరుఫు న్యాయవాదులు.. మరో నెల రోజులపాటు ఫారెన్ టూర్‌కు పర్మిషన్ ఇవ్వాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న సీబీఐ కోర్టు.. తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నెల 29న తీర్పు వెల్లడిస్తామని న్యాయస్థానం తెలిపింది. దీంతో విజయ సాయి రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి లభిస్తుందా..? లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
వైసీపీలో కీలక నేతగా ఉన్న విజయ సాయి రెడ్డి ఎవరూ ఊహించని విధంగా రాజకీయాల నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. పాలిటిక్స్‌కు గుడ్ బై చెప్పడంతో రాజ్యసభ సభ్యత్వానికి కూడా విజయ సాయి రెడ్డి రిజైన్ చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేసిన రోజుల వ్యవధిలోనే విజయ సాయి రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఉన్న ఫలంగా రాజకీయాల నుంచి వైదొలిగి.. విదేశీ పర్యటనకు వెళ్లాలని విజయ సాయి రెడ్డి తీసుకున్న నిర్ణయం ఎవరికీ అంతు చిక్కడం లేదు. విజయ సాయి రెడ్డి నెక్ట్స్ ప్లాన్ ఏంటనే దానిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. మరీ విజయ సాయి రెడ్డి విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇస్తుందా లేదా అనేది తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.