- స్పెషల్ బస్సుల్లోనే సవరించినం
హైదరాబాద్, వెలుగు: బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ధరలు పెంచినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని సంస్థ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. జీవో ప్రకారం స్పెషల్ బస్సుల్లో మాత్రమే చార్జీలను సవరించామని, రెగ్యులర్ సర్వీస్‌ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. చార్జీలు అధికంగా వసూలు చేసి ప్యాసింజర్ల నుంచి దోచుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన ఆరోపణలకు సజ్జనార్ వివరణ ఇచ్చారు.
సంక్రాంతి, దసరా, రాఖీ పౌర్ణమి, వినాయక చవితి, ఉగాది తదితర ప్రధాన పండుగుల సమయాల్లో హైదరాబాద్ నుంచి ప్రయాణికులు ఎక్కువగా సొంతూళ్లకు వెళ్తుంటారని, ఈ సందర్భాల్లో ప్రజలకు రవాణాపరంగా ఇబ్బందులు తలెత్తకుండా స్పెషల్ సర్వీసులను ఆర్టీసీ నడుపుతుందన్నారు. రద్దీని బట్టి హైదరాబాద్ సిటీ బస్సులను కూడా జిల్లాలకు తిప్పుతున్నామని, తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల రద్దీ ఉండకపోవడంతో ఖాళీగా ఆ బస్సులు వెళ్తుంటాయని, ఆ స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని 2003లో జీవో నంబర్ 16ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందని ఎండీ గుర్తు చేశారు.
పండగ సమయాల్లో మాత్రమే జీవో ప్రకారం స్పెషల్ సర్వీసుల్లో టికెట్ ధరలను సవరించడం జరుగుతుందని, సాధారణ రోజుల్లో యథావిధిగా సాధారణ టికెట్ ధరలే ఉంటాయన్నారు. స్పెషల్ బస్సుల్లో మాత్రమే రూ.1.50 వరకు టికెట్ ధరను సవరించుకునే వెసులుబాటును సంస్థకు జీఓ ఇచ్చిందని పేర్కొన్నారు. ఆర్టీసీలో ప్రస్తుతం 9 వేల బస్సులు ఉండగా.. పండుగ సమయాల్లో రద్దీకి అనుగుణంగా ప్రతి రోజు సగటున 500 స్పెషల్ బస్సులను నడుపుతున్నామని, వాటిలో మాత్రమే స్పెషల్ చార్జీలు వసూలు చేస్తున్నామని, మిగతా రెగ్యులర్ బస్సుల్లో ఎలాంటి మార్పులు లేవన్నారు. రెగ్యులర్ బస్సులో వెళ్లినపుడు, రిటర్న్ జర్నీలో స్పెషల్ బస్సులో వస్తే సవరణ చార్జీలు ఉంటాయని ఎండీ తెలిపారు.