
- బీసీ కులాల మధ్య చిచ్చు పెడితే ఊరుకోం..
- ఈ నిర్ణయాన్ని బీసీ కమిషన్ పునసమీక్షించాలి
- ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
బషీర్బాగ్, వెలుగు: ఏపీకి చెందిన 26 బీసీ కులాలను తెలంగాణలో బీసీ జాబితాలో చేర్చే నిర్ణయాన్ని బీసీ కమిషన్ పున: సమీక్షించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కోరారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఎమ్మెస్ నరహరి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నో ఏండ్లుగా వెనుకబడిన బీసీ కులాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయన్నారు.
ఈ సమయంలో ఆంధ్ర బీసీ కులాలను తీసుకొచ్చి తెలంగాణ బీసీ కులాలలో కలపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హైకోర్టు తీర్పును ప్రభుత్వం ఉల్లంఘించడం మంచిది కాదన్నారు. బీసీ కులాల మధ్య పంచాయితీ పెడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బీసీ నేతలు డా. భాగయ్య, కె.రామచందర్, ప్రొ. సాంబయ్య, ప్రొ. సాంబమూర్తి, పరమేశ్వరి తదితరులు పాల్గొన్నారు.