
అ క్షయ తృతీయ వస్తుంది. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ద తదియ ( 2025 ఏప్రిల్ 30)న ఘనంగా జరుపుకుంటాం. ఆ రోజున బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తే అవి అక్షయంగా అంటే చిరకాలం నశించకుండా ఉంటాయనే నమ్మకం ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం కొత్త వస్తువులు కొనడమే కాదు.. ఇంట్లో కొన్ని వస్తువులు తొలగించాలి. పాత వస్తువుల.. ఉపయోగించనవి ఇంట్లో ఉంటే ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు. ఎలాంటి వస్తువులు తీసేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. . .
ఉపయోగించని వాల్ క్లాక్: ప్రతి ఇంట్లో వాల్ క్లాక్ ఉంటుంది. ఇప్పుడు సెల్ ఫోన్ వాడకం మొదలు పెట్టిన తరువాత అది పనిచేయకపోయిన ఇంట్లో గోడకు వేలాడుతూనే ఉంటుంది. క్లాక్ లో ముళ్ల మాదిరిగా నిడిల్స్ ఉంటాయి. ఇవి కదలకుండా స్థిరంగా ఉంటే ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. వాటిని అలానే ఉంచితే ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో ఉపయోగించని వాల్ క్లాక్ ఉంటే వెంటనే తీసేయండి.
చిరిగిన బట్టలు: బీరువాలో వాడనవి.. చిరిగినవి.. పాత బట్టలు బోలెడు ఉంటాయి. ఎండాకాలంలో కాటన్ దుస్తులు.. వర్షాకాలం.. శీతాకాలంలో శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే బట్టలు వాడుతున్నాం కదా..! వాడే డ్రస్ ల కంటే వాడనివే ఇంట్లో ఎక్కువ ఉంటాయి. చినిగిన బట్టలు దరిద్రాన్ని కలుగజేస్తాయని పండితులు అంటున్నారు. మాసిపోయిన బట్టలను చూస్తే అసహ్యం వేస్తుంది కదా. మీ ఇంట్లో అలాంటివి ఏమైనా ఉంటే బయటపడేయండి. అలాంటి వాటిని ఇంట్లో అస్సలికి ఉంచుకోవద్దంటున్నారు వాస్తు పండితులు.
ఎండిపోయిన మొక్కలు: ఎండలు ముదిరాయి. నీళ్లకోసం జనాలే కాదు మొక్కలు కూడా అల్లాడిపోతాయి. మొక్కలకు నీళ్లు పోయకపోతే ఎండిపోతాయి. నీళ్లు సరిపడ పోయకపోయినా ఓడిపోతాయి. ఇలాంటివి ఇంట్లో ఉంటే దురదృష్టానికి సంకేతమని పండితులు చెబుతున్నారు. ఎండిపోయిన మొక్కలు ఉంటేవాటిని వేళ్లతో సహా తొలగించి.. మళ్లీ కొత్త మొక్కలు నాటి.. నీళ్లను పోయండి. మొక్కలు పచ్చగా ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది కదా..!
విరిగిన చీపురు: ఇంటిని శుభ్రం చేసేందుకు చీపురు వాడతారు. రోజు రెండు సార్లు వాడతాం కాబట్టి అది తొందరగా పాడయిపోతుంది. ప్రతి గదిని శుభ్రం చేయాలా కదా..! అలాంటి చీపురు విరిగిపోయినా చివళ్లు కుచించుకుపోయినా దానినే వాడుతుంటాం. అలాంటి చీపురుతో ఊడిస్తే ఇల్లు శుభ్రం కాదు కదా..! దరిద్రం వెంటాడుతుంది. అస్తవ్యస్తంగా .. దుమ్ము.. ధూళి ఉన్నచోట లక్ష్మీదేవి ఉండేందుకు ఇబ్బంది పడుతుంది. ఒకవేళ వచ్చినా వెంటనే పక్కింటికి వెళ్లిపోతుంది. చిరిగిన చీపురును వెంటనే బయటపడేసి.. కొత్త చీపురును కొనుక్కోండి.
విరిగిన చెప్పులు: పాత చెప్పులు.. విరిగిపోయి ఉంటాయి. పొద్దున్నే వాకింగ్‌కు.. లేదా కొద్ది దూరం వెళ్లాల్సి వచ్చినప్పుడు ఉపయోగించుకోవచ్చులే అని వాటిని చెప్పుల స్టాండులో పెడతారు. చెప్పు విరిగితే అశుభానికి సంకేతం. ఇలాంటివి ఇంట్లో గందరగోళ పరిస్థితికి దారితీస్తాయి. ఇంట్లో పాతవస్తువులు.. పాత పేపర్‌లు.. పనికిరాని ఇనుపవస్తువులు.. ఇవన్నీ కూడా ఆర్ధిక ఇబ్బందులకు తెరలేపుతాయి. ఇలాంటి వస్తువులు మీ ఇంట్లో ఉండే.. అక్షయ తృతీయ (ఏప్రిల్ 30) లోపు వెంటనే తొలగించండి.