కాల్ సెంటర్ ఫిర్యాదులను పెండింగ్ ​పెట్టొద్దు: రోనాల్డ్​ రోస్ ​ఆదేశం

హైదరాబాద్, వెలుగు: మై జీహెచ్ఎంసీ యాప్, జీహెచ్ఎంసీ వెబ్ సైట్, డయల్ 100, కాల్ సెంటర్ కు ఆన్ లైన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను ఆయా శాఖల అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆదేశించారు. గురువారం హెడ్డాఫీసులో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆన్ లైన్ లో వచ్చిన ఫిర్యాదులను పెండింగ్ పెట్టొద్దన్నారు. 

శాఖల వారీగా వచ్చిన గ్రీవెన్స్ ను హెచ్ఓడీలు ఫాలోఅప్ చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఆయా విభాగాల హెచ్ఓడీలు కె.శ్రీవాత్సవ, స్నేహశబరీశ్, ఈఎన్సీ జియాఉద్దీన్, సీఈ దేవానంద్, అడిషనల్ కమిషనర్లు పాల్గొన్నారు. అలాగే వరద నీటి నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆదేశించారు. 

గురువారం మాదాపూర్ లోని బాటా షోరూం, యశోద హాస్పిటల్, శిల్పారామం తదితర ప్రాంతాలలో వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లను జోనల్ కమిషనర్ స్నేహ శబరీష్ తో కలిసి పరిశీలించారు. రోడ్లపై  వరద నీరు నిల్వకుండా శాశ్వత చర్యలు చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. త్రిశూల్ గ్రాండ్ వద్ద సైడ్ రోడ్ ప్రతిపాదనకు ప్లాన్​సిద్ధం చేయాలని, బాటా షో రూమ్ దగ్గర సైడ్ వెంట్స్ క్లియర్, డిసిల్టింగ్ చేయాలని, విక్రమ్ హాస్పిటల్ రోడ్డులో కొత్త బాక్స్ డ్రైన్ ను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కమిషనర్ ఎస్ఈ శంకర్, డిప్యూటీ కమిషనర్, తదితరులు పాల్గొన్నారు.