
- నిరంతర కరెంట్ సరఫరాకు ముందుస్తు ఏర్పాట్లు చేసుకోవాలి
- అభివృద్ధి పనులపై ఆఫీసర్లతో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రివ్యూ
కోల్ బెల్ట్/జైపూర్, వెలుగు: ఎండాకాలంలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆఫీసర్లను ఆదేశించారు. నియోజకవర్గ పరిధిలోని మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో అమృత్ స్కీం డ్రింకింగ్ వాటర్ సప్లై పనులను స్పీడప్ చేయాలని సూచించారు.
శుక్రవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించి, వివిధ అభివృద్ధి పనులపై జైపూర్సింగరేణి పవర్ ప్లాంట్ గెస్ట్ హౌజ్‌లో కలెక్టర్ కుమార్ దీపక్, మున్సిపల్, సింగరేణి ఆఫీసర్లతో రివ్యూ చేశారు. మిషన్ భగీరథ ద్వారా వాటర్‌ను సప్లై చేయడంతో పాటు అవసరమైన చోట ట్యాంకర్లను ఏర్పాటు చేయాలని, బోర్ వెల్స్‌కు కూడారిపేర్లు చేయించాలని సూచించారు. డీఎంఎఫ్‌టీ ఫండ్స్‌తో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. వేసవిలో కరెంట్ కోతలు లేకుండా ముందుస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
రివ్యూలో డీఆర్డీవో కిషన్, పంచాయతీ రాజ్ ఇంజినీర్ రామ్మోహన్‌రావు, పబ్లిక్ హెల్త్ ఈఈ గంగాధర్, ఏడీ బాలకృష్ణ, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం దేవేందర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్లు గద్దె రాజు, రాజలింగు, మురళీకృష్ణ, మిషన్ భగీరథ డీఈ విద్యాసాగర్, ఎంపీడీవోలు సత్యనారాయణ, మధుసూదన్ పాల్గొన్నారు. అనంతరం జైపూర్ మండలం ఇందారం బస్టాండ్ వద్ద రాజీవ్ రహదారిపై ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ను ప్రారంభించారు.
ఇందారం ఓపెన్ కాస్ట్ సమీపంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి జైపూర్ ప్లాంట్ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు హెచ్‌కేఆర్ కంపెనీ చొరవచూపాలన్నారు. అలాగే శ్రీరాంపూర్ సింగరేణి ఓపెన్ కాస్ట్‌లో భూములు కోల్పోయిన జైపూర్ మండలం రామారావుపేట పంచాయతీ గుత్తేదారుపల్లి నిర్వాసితులకు నష్టపరిహారం ఇప్పించేందుకు కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు రేగుంట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వాసితులు ఎమ్మెల్యే, కలెక్టర్‌ను కోరారు.
వేలాల జాతరను సక్సెస్ చేసిన వారికి అభినందన
మహాశివరాత్రి సందర్భంగా మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాలలో జరిగిన శ్రీగట్టు మల్లన్న స్వామి జాతరను సక్సెస్ చేసిన పోలీస్, పంచాయతీరాజ్, వైద్య, దేవాదాయ, అగ్నిమాపక, రెవెన్యూ శాఖల ఆఫీసర్లు, సిబ్బందిని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అభినందించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వసతులు కల్పించడం అభినందనీయమన్నారు.