ఈవీఎంల కమిషనింగ్​లో తప్పిదాలు జరగొద్దు : వీపీ గౌతమ్

ఈవీఎంల కమిషనింగ్​లో తప్పిదాలు జరగొద్దు : వీపీ గౌతమ్

ఖమ్మం టౌన్,వెలుగు :  ఈవీఎం కమిషనింగ్ ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులకు సూచించారు. ఆదివారం ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో చేపడుతున్న ఖమ్మం, పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ల ఈవీఎం, వీవీ ప్యాట్ల కమిషనింగ్ ప్రక్రియను ఆయన తనిఖీ చేశారు. బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్ల కనెక్షన్లపై కమిషనింగ్ ప్రక్రియలో చేయాల్సిన, చేయకూడని పనుల విషయమై అవగాహన కలిగివుండాలన్నారు. 

బ్యాలెట్ యూనిట్ ఔటర్ కవర్ ను పింక్ పేపర్ సీల్, అడ్రస్ ట్యాగ్ లతో సీల్ చేయాలన్నారు. వీవీ ప్యాట్ లో సీరియల్ నంబర్, అభ్యర్థి పేరు, సింబల్ ని సింబల్ లోడింగ్ యూనిట్ తో లోడ్ చేయాలని చెప్పారు. వీవీ ప్యాట్ పేపర్ రోల్ కాంపార్టుమెంట్ ను అడ్రస్ ట్యాగ్ తో సీల్ చేయాలన్నారు. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ నుంచి, కమిషనింగ్ హాల్ వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. 

రిజర్వ్ పోలింగ్ సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ లో 36 టేబుళ్లు, పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ లో 29 టేబుళ్లు ఏర్పాటుచేసి కమిషనింగ్ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. సోమవారం లోగా ప్రక్రియ పూర్తిచేయనున్నట్లు చెప్పారు. ఆయన వెంట అసెంబ్లీ సెగ్మెంట్ సహాయ రిటర్నింగ్ అధికారి, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ సురభి, పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ సహాయ రిటర్నింగ్ అధికారి, ఎస్డీసీ ఎం. రాజేశ్వరి, తహసీల్దార్లు, అధికారులు ఉన్నారు.

మధిరలో.. 

మధిర :  మధిర  మండల పరిధిలోని ఖాజీపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న ఈవీఎంల కమిషనింగ్ ను ఆదివారం కలెక్టర్ గౌతమ్ పరిశీలించారు.  ఆయన వెంట ఆర్డీవో గణేశ్, తహసీల్దార్  వెంకటేశ్వర్లు, సర్కిల్ ఇన్​స్పెక్టర్​ మధు, రూరల్ ఎస్సై భార్గవి ఉన్నారు. 

వైరాలో.. 

వైరా : వైరా సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాలలో చేపడుతున్న వైరా సెగ్మెంట్ ఈవీఎం, వీవీ ప్యాట్ల కమిషనింగ్ ప్రక్రియను గౌతమ్ ఆదివారం తనిఖీ చేశారు. వివిధ పార్టీల ప్రతినిధులను కమిషనింగ్ ప్రక్రియను గమనించాలని సూచించారు. పోలింగ్ సామగ్రిని పరిశీలించారు. సోమవారం లోగా కమీషనింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సత్తుపల్లిలో అడిషనల్​ కలెక్టర్..

సత్తుపల్లి :  పట్టణంలోని జ్యోతి నిలయం స్కూల్​లో ఉంచిన ఈవీఎం, వీవీ ప్యాట్లు, కంట్రోల్ యూనిట్లను ఆర్డీవో రాజేంద్ర గౌడ్ తో కలిసి అడిషనల్​కలెక్టర్ మధుసూదన్ ఆదివారం  పరిశీలించారు.  ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడి ఎన్నికల నిర్వహణ, చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. పోలింగ్ ముందు రోజు ఈవీఎం యూనిట్ సెట్లు బూత్ లకు పంపిణీ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ యోగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.