వనపర్తి, వెలుగు: రేషన్ పంపిణీలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం పెద్దగూడెం జీపీ పరిధిలోని రేషన్ దుకాణాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తూకాన్ని పరిశీలించి.. బియ్యం సరిగ్గా ఇస్తున్నారా.. ? అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం నిర్దేశించిన మేరకు బియ్యం ఇవ్వాలని, డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అనంతరం నర్సరీని విజిట్ చేసి లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు పెంచాలని సూచించారు. తర్వాత వ్యవసాయ మహిళా డిగ్రీ కాలేజీ పునర్నిర్మాణ పనులను పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఎస్వో సుదర్శన్, తహసీల్దార్ రాజేందర్ గౌడ్ ఉన్నారు.
బాల్య వివాహం నిలిపివేత
నవాబుపేట, వెలుగు: గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న బాల్య వివాహాన్ని ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు నిలిపి వేశారు. ఎస్సై పురుషోత్తం వివరాల ప్రకారం.. మండలంలోని లోకిరేవు గ్రామానికి చెందిన బాలిక(15)కు దొడ్డిపల్లికి చెందిన రామాంజనేయులు(25)తో పెళ్లి చేసేందుకు కుటుంబసభ్యులు బుధవారం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అంగన్వాడీ టీచర్ల ద్వారా సమాచారం అందుకున్న ఐసీడీఎస్ సూపర్వైజర్ రాజేశ్వరి ఉదయాన్నే పోలీసులతో కలిసి గ్రామానికి చేరుకున్నారు. ప్రైమరీ స్కూల్‌లో బాలిక బోనఫైడ్ సర్టిఫికెట్చూసి మైనర్‌గా నిర్ధారించుకున్నారు. అనంతరం మ్యారేజ్జరుతున్న ఇంటికి వెళ్లగా పోలీసులను చూసి వరుడు పరారయ్యాడు. బాలికను చైల్డ్వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరిచి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
కాంట్రాక్టు లెక్చరర్లకు పెండింగ్ వేతనాలివ్వండి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పని చేస్తున్న 122 మంది కాంట్రాక్టు లెక్చరర్లకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి కలెక్టర్ వెంకట్ రావును కోరారు. బుధవారం కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు లెక్చరర్లకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల వేతనాలు రాలేదని వాపోయారు. మిగతా జిల్లాల్లో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వేతనాలిచ్చారని గుర్తుచేశారు. వెంటనే వారి వేతనాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
చల్లా బీఆర్‌ఎస్‌లో చేరడం బాధగా ఉంది
శాంతినగర్, వెలుగు: మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరడం తనకు బాధ కలిగించిందని మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ పొలిటికల్ అఫైర్ కమిటీ మెంబర్ సంపత్ కుమార్ వాపోయారు. ఎవరు పార్టీ మారినా తల్లిలాంటి కాంగ్రెస్‌ను తాను వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బుధవారం వడ్డేపల్లి మండల కేంద్రమైన శాంతినగర్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కార్యకర్తలు అధైర్య పడొద్దని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. బీఆర్‌ఎస్ తనని ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా.. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పని చేశానన్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ నీతి, నిజాయితీతో పని చేశానే తప్ప, ఆత్మాభిమానం ఏనాడూ పోగొట్టుకోలేదన్నారు. ఎమ్మెల్యేగా ఉండి ఆర్డీఎస్ సింధనూర్ వద్ద దీక్ష చేయడంతో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం మంజూరైందని గుర్తుచేశారు. 30 పడకల ఆసుపత్రి, రెసిడెన్షియల్ స్కూల్స్ తన హయాంలోనే వచ్చాయని తెలిపారు. బీఆర్‌ఎస్‌లో నాయకుల మధ్య సఖ్యత లేదని, ఇసుక మాఫియా, ప్రభుత్వ పథకాల పేరిట అడ్డగోలు కమీషన్లు తీసుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. దమ్ముంటే బీఆర్‌ఎస్ తరుఫున పోటీ చేసే వ్యక్తి పేరు ప్రకటించాలని సవాల్ విసిరారు. అనంతరం రెండోసారి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన పటేల్ ప్రభాకర్ రెడ్డిని శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ సుజాత, జిల్లా మహిళా అధ్యక్షురాలు నాగ శిరోమణి, కౌన్సిలర్లు, సుజాత, మాస్టర్ షెక్షావలి, గడ్డం శ్రీను, ఎర్రవల్లి సర్పంచ్ జోగులరవి, జగన్మోహన్ నాయుడు, పచ్చర్ల కుమార్, రాజనందం లాల్ గౌడ్ పాల్గొన్నారు.
ఇండ్ల ఎంపికలో గందరగోళం
అలంపూర్, వెలుగు: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపిక కోసం అలంపూర్ మండలం క్యాతూర్‌లో నిర్వహించిన గ్రామసభ గందరగోళానికి దారితీసింది. బుధవారం సర్పంచ్ లలితమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు తహసీల్దార్ సుభాష్ నాయుడు, ఎంపీడీవో నాగసూరి, పంచాయతీ సెక్రటరీ రవితేజ హాజరయ్యారు. 20 ఇండ్లకు సంబంధించి 380 మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పటికే ఇంటింటి సర్వే చేసి 30 మంది లబ్ధిదారుల జాబితాను అధికారులు ఎంపిక చేశారు. ఇందులో అభ్యంతరాలు ఉంటే రెండు రోజుల్లో లిఖితపూర్వకంగా అందజేయాలని సూచించారు. జాబితా పేర్లను చదువుతుండగా.. కొందరు గ్రామస్తులు అర్హులను ఎంపిక చేయలేదని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎంపికైన వారు కూడా వాగ్వాదం చేయడంతో గందరగోళం నెలకొంది. దీంతో అధికారులు ఇప్పటికీ అర్హులైన వారుంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామస్తులు బుధవారం కొత్తగా 10 దరఖాస్తులను అధికారులకు అందజేశారు. ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత కలెక్టర్ రిపోర్ట్ ఇవ్వనున్నట్లు తహసీల్దార్ చెప్పారు.
యాసంగికి వారబందీ పద్ధతిలో సాగునీరు
గద్వాల, వెలుగు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కింద యాసంగి పంటకు వారబందీ పద్ధతిలో సాగునీరు విడుదల చేస్తామని పీజేపీ ఎస్‌సీ జుబేర్ అహ్మద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 19 నుంచి పంట కాలువలకు నీటిని ఇవ్వాలని నిర్ణయించామని, సోమవారం నుంచి గురువారం వరకు కాలువలకు నీళ్లిస్తామన్నారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజులపాటు నీటిని నిలిపివేస్తామని చెప్పారు. కుడి, ఎడమ కాలువలకు ఇదే పద్ధతిలో నీటిని విడుదల చేస్తామని, ఆయకట్టు రైతులు సహకరించాలని కోరారు.
మక్తల్‌కు డిగ్రీ కాలేజీ మంజూరు
హైదరాబాద్, వెలుగు: నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గానికి డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించనున్నట్లు అందులో పేర్కొన్నారు. కాగా, విద్యార్థి సంఘాలు చాలా ఏండ్లుగా డిగ్రీ కాలేజీ కోసం పోరాటం చేస్తున్నాయి. ఎట్టకేలకు సర్కారు కాలేజీ మంజూరు చేయడంపై సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ నేతలు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, సీఎం కేసీఆర్‌కు థాంక్స్ చెప్పారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు అప్లై చేసుకోండి
వనపర్తి టౌన్, వెలుగు: జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రారంభించనున్న కంటి వెలుగు కార్యక్రమం కోసం డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వనపర్తి జిల్లాలో 28 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తున్నామని, ఈ నెల 15 న డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పారు. అభ్యర్థులు బయోడేటా ఫామ్, ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు రావాలని సూచించారు. పూర్తి వివరాలకు www.wanaparthy.telangana.gov.in వెబ్ సైట్ లో సంప్రదించాలన్నారు.
బాలికపై లైంగిక వేధింపులు
నిందితుడిపై పోక్సో కేసు నమోదు
నవాబుపేట, వెలుగు: బాలికను లైంగిక వేధించిన యువకుడిపై మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసును నమోదైంది. ఎస్సై పురుషోత్తం వివరాల ప్రకారం.. మండలంలో కూచూరు గ్రామానికి చెందిన బాలిక(13) తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో ఆమె తండ్రి అన్నీతానై పెంచుతున్నాడు. కుటుంబ పోషణకై ఆయన ప్రతిరోజూ కూలీ పనికి వెళ్తుండడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న బాలికపై అదే గ్రామానికి చెందిన మాల భూపాల్ కన్నేశాడు. కొంత కాలంగా లైంగికంగా వేధిస్తుండడంతో బాలిక తండ్రికి చెప్పింది. దీంతో ఆయన బుధవారం బాలికతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై లైంగిక వేధింపులతో పాటు పోక్సో చట్టం కింద కేసును నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
కంటివెలుగుకు 24 టీమ్‌లు
నారాయణపేట, వెలుగు: జనవరి18 నుంచి ప్రారంభం కానున్న రెండో విడత కంటి వెలుగు కోసం జిల్లాలో 24 బృందాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం తన ఛాంబర్ లో వైద్యారోగ శాఖ, పంచాయతీ రాజ్, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వంద రోజుల పాటు నిర్వహించనున్న కంటివెలుగుకు అవసరమైన మౌలిక సదుపాయాలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. రోజువారీగా ఏ బృందం ఎక్కడ పరీక్షలు నిర్వహించాలో పక్కా ప్లాన్ ఉండాలన్నారు. ఏమైన సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, డీఎంహెకచ్‌వో డా.రాంమనోహర్ పాల్గొన్నారు.
సీహెచ్‌సీలను పక్కాగా నిర్వహించాలి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: వ్యవసాయ పనిముట్లు అద్దెకిచ్చే కస్టమ్ హైరింగ్ సెంటర్లను(సీహెచ్‌సీ) సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఎస్.వెంకట్ రావు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో ఉమ్మడి జిల్లాలోని గ్రామీణాభివృద్ధి శాఖ డీపీఎం, ఏపీఎం, మేనేజర్లు, అకౌంటెంట్లకు పీహెచ్‌సీల నిర్వహణపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. సీహెచ్‌సీ సామర్థ్యం పెంపు, వాడకంపై గ్రామ, మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం హన్వాడ, నవాబ్ పేట, సీసీ కుంట, గండీడ్ తదితర మండలాల్లో సెంటర్ల పనితీరు అడిగి తెలుసుకున్నారు. ఈ సెంటర్లను దళిత బంధు యూనిట్లకు అనుసంధానం చేయాలని ఆదేశించారు. ట్రాలీలు ఉన్న సీహెచ్‌సీలు రూ. 100 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే ఇసుకను తరలించేందుకు అనుమతిస్తామని చెప్పారు.