![లెటర్ టు ఎడిటర్: డీఈఓ పోస్టులను గ్రూప్-1లో కలపొద్దు](https://static.v6velugu.com/uploads/2025/02/do-not-merge--deo-posts-with-group-i-posts-say-analayst-sampati-ramesh-maharaj_2LsBMcQpvP.jpg)
విద్య నాణ్యతా ప్రమాణాలు పెంచడానికి రాష్ట్రం నుంచి మండలస్థాయి వరకు పర్యవేక్షణ అవసరం. ఇందులో భాగంగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఎడ్యుకేషన్ సెక్రటరీ రాష్ట్రస్థాయిలో విద్యావ్యవస్థను పర్యవేక్షణ చేయగా... జిల్లా స్థాయిలో జిల్లా విద్యాధికారుల ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థ నిర్వహణ జరుగుతుంది.
వీరి కింద డివిజన్ స్థాయిలో జిల్లా ఉప విద్యాధికారి ఉంటాడు. ఇతన్నే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్(Dy.E.O) అంటారు. తదుపరి మండల స్థాయిలో మండల విద్యాధికారి ఉంటాడు. డివిజన్ స్థాయిలో ఉప విద్యాధికారి పోస్టు అనేది చాలా ముఖ్యమైనది. జిల్లా విద్యాధికారికీ సహాయంగా ఉంటూ డివిజన్ స్థాయిలో పాఠశాల విద్యా వ్యవస్థను పర్యవేక్షిస్తాడు.
పాఠశాల విద్యా వ్యవస్థలో ఎగ్జామ్ ద్వారా డైరెక్టుగా రిక్రూట్మెంట్ చేసే ఉన్నతమైన పోస్ట్ ఇది. గతంలో డిప్యూటీ ఈ.ఓ పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేశారు. కానీ, ఇటీవల ప్రభుత్వం వీటిని గ్రూప్-1లో కలిపి నింపాలని యోచిస్తుంది. పీజీ డిగ్రీతోపాటు, బీఈడీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అదేవిధంగా పరీక్ష విధానంలో కూడా వైవిధ్యం ఉంటుంది.
ఇప్పుడు ప్రభుత్వం డిప్యూటీ ఈ.ఓ పోస్ట్ ను గ్రూప్-1తో కలిపి నింపడం వలన అభ్యర్థులకు నష్టం జరుగుతుంది. అంతేకాకుండా న్యాయపరమైన సమస్య తలెత్తే అవకాశం ఉంది. గ్రూప్-1 నియామకం, ఎంపిక విధానం వేరు. గతంలో ఈ పోస్ట్ నియామకానికి ఆబ్జెక్టివ్ విధానంలో మూడు పేపర్లు ఉండేవి.
ఒక పేపర్ జనరల్ స్టడీ కాగా...మరో రెండు పేపర్లు విద్యకు సంబంధించిన సైకాలజీ, తత్వశాస్త్రం, సమకాలీన విద్యా విధానాలతో కూడిన సిలబస్ ఉండేది. కానీ, ఇప్పుడు డిప్యూటీ ఈ.ఓ పోస్టులను గ్రూప్ 1తో కలపడం వలన మొత్తం పరీక్షా విధానం, ఎంపిక ప్రక్రియ మారిపోతుంది. గ్రూప్-1లో కలపడం వలన పాఠశాల విద్యా వ్యవస్థకు నష్టం. కావున, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులను విడిగానే పరీక్ష పెట్టి ఎంపిక చేయాలి. డిప్యూటీ ఈ.ఓ పోస్టులను విడిగానే నియామకం చేయాలి.
- సంపతి రమేష్ మహరాజ్-