వచ్చే ఏడాది కళాభారతిలో ఘనంగా బాలోత్సవం
మహబూబ్‌నగర్, వెలుగు : కొందరు తల్లిదండ్రులు మార్కులపై దృష్టి పెట్టి వారి పిల్లలను తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తారని, మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ర్యాంకులపై దృష్టి పెట్టి విద్యార్థులను ఆటపాటలకు దూరం చేయడం సరి కాదన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని అప్పనపల్లి వద్ద బృందావన్ గార్డెన్స్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన పిల్లలమర్రి బాలోత్సవం కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల ప్రయోగాలను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పిల్లలు బాల్యాన్ని ఆస్వాదించేలా చూడాలని తల్లిదండ్రులను కోరారు. కొత్తగా నిర్మిస్తున్న కళాభారతిలో వచ్చే ఏడాది వారం రోజులపాటు బాలోత్సవాలను నిర్వహిస్తామని మంత్రి ప్రకటించారు. అనంతరం 'కంటి వెలుగు' కార్యక్రమంలో డీటీపీ ఆపరేటర్లుగా పనిచేసేందుకు నియమించిన 45 మందికి మంత్రి నియామక పత్రాలను అందజేశారు. అలాగే రాత్రి హన్వాడ మండలం కొనగట్టుపల్లి గ్రామానికి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు 20 మందికి ప్రభుత్వం తరఫున గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో డీఎంఅండ్‌హెచ్‌వో శశికాంత్, పిల్లలమర్రి బాలోత్సవం అధ్యక్షుడు బెక్కెం జనార్దన్, జిల్లా జనరల్ హాస్పిటల్ సూపరిండెంటెంట్ రాంకిషన్ పాల్గొన్నారు.
మిషన్ భగీరథ నీళ్లు వస్తలే..
జనరల్ బాడీ మీటింగ్‌లో లీడర్ల ప్రశ్నలు
పెబ్బేరు, వెలుగు : మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామాల్లో ప్రజల దాహీర్తి తీరడం లేదని పెబ్బేరు మండల లీడర్లు వాపోయారు. పట్టణంలోని ఎంపీడీవో ఆఫీస్‌లో మంగళవారం ఎంపీపీ ఆవుల శైలజ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపించారు. వివిధ శాఖల అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. తాగునీటికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులు కోరారు. శ్మశాన వాటికల నిర్మాణాలు పూర్తయినా నేటికీ బిల్లులు రాలేదని చెప్పారు. ఇదిలా ఉండగా.. 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశానికి అధికారులు, పలువురు లీడర్లు 12.45 వరకూ హాజరుకాలేదు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, సర్పంచులు సువర్ణ, గోవింద్ నాయుడు, వెంకటస్వామి, రమాదేవి, ఎంపీటీసీలు రాధ, నారాయణమ్మ, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న విద్యార్థుల మాక్ పోలింగ్
మదనాపురం వెలుగు: మండలంలోని అజ్జకొల్లు జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మంగళవారం మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఎన్నికల్లో పోటీచేశారు. కొందరు ఓటర్లుగా, ఎన్నికల సిబ్బంది గా, పోలీసులుగా విధులు నిర్వహించారు. విద్యార్థులకు ఎన్నికల విధానంపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించేందుకే మాక్ పోలింగ్ నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అతీక్ అహ్మద్ పేర్కొన్నారు. ఈ మాక్ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా రుక్మిణి, ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా నందిని వ్యవహిరించారు. మాక్ పోలింగ్ విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు శ్యాం ప్రసాద్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వీరన్న ఇబ్రహీం పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
బీసీలకు 52శాతం రిజర్వేషన్లు ఇవ్వాలె
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : బీసీల హక్కులను కాలరాస్తున్న పార్టీలను బీసీలు పాతరేయాలని బీఎస్సీ జిల్లా అధ్యక్షుడు కుమార్ అన్నారు. నాగర్ కర్నూల్ ఎస్సీ కాంప్లెక్స్ వద్ద బీసీలకు జనాభా తమాషా ప్రకారం 52 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సంతకాల సేకరణ కార్యక్రమం మంగళవారం చేపట్టారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పార్టీలలో పనిచేస్తున్న బీసీ నాయకులు, కార్యకర్తలు తక్షణమే ఆ పార్టీలను వదిలేయాలని కోరారు. బీసీలకు 52 శాతం రిజర్వేషన్ ఇచ్చేవరకు పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఇన్చార్జి అంతటి నాగయ్య, జిల్లా కార్యదర్శి రామచందర్, పృథ్వీరాజ్, ఆనంద్, కల్యాణ్, నాగేశ్, వెంకటేశ్ పాల్గొన్నారు.
కాచిగూడ -విశాఖపట్నం రైలును పాలమూరుకు వరకు పొడిగిస్తాం
సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరూణ్కుమార్ జైన్
మహబూబ్‌నగర్/జడ్చర్ల టౌన్, వెలుగు : కాచిగూడ నుంచి విశాఖపట్నం వెళ్లే రైలును త్వరలో పాలమూరు వరకు పొడిగిస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. మహబూబ్‌నగర్, జడ్చర్ల రైల్వే స్టేషన్లను మంగళవారం సాయంత్రం ఆయన సందర్శించారు. పాలమూరు స్టేషన్లో పార్క్‌ను పరిశీలించారు. అక్కడ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ మధ్య డబ్లింగ్ లైన్‌తో పాటు ఎలక్ర్టిసిటీ పనులు పూర్తయినట్లు చెప్పారు. జైపూర్-హైదరాబాద్ రైలును పాలమూరుకు వరకు పొడిగించేందుకు ప్రణాళికలకు రూపొందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఆయన జడ్చర్లకు చేరుకొని రైల్వే సూపర్వైజర్ ఆఫీస్‌ను ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, మునిసిపల్ చైర్‌పర్సర్ లక్ష్మీ, జడ్పీ వైస్ చైర్మన్ కోడ్గల్ యాదయ్య పలు సమస్యలపై జీఎంకు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డివిజనల్ రైల్వే మేనేజర్ శరత్చంద్రయాన్ పాల్గొన్నారు.