తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇటీవల ఇంటర్ఫలితా లు వెల్లడిస్తూ..ఎంసెట్లో వెయిటేజ్ మార్కులు ఉండవని ప్రకటించారు. కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా ఇంటర్ మీడియట్ లో బీసీ, ఎస్సీ, మైనారిటీ కాలేజీల్లో 300కు పైగా మంది విద్యార్థులకు రాష్ట్ర స్థాయి ర్యాంకులు వచ్చాయి. ఈ విజయం గొప్ప విషయం. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి చేసిన ప్రకటనతో ప్రభుత్వ కాలేజీల్లో చదువుకుంటున్న మెరిట్స్టూడెంట్స్కు ఎంసెట్లో కలిగే ప్రయోజనానికి గండిపడింది. వారి ఆశలు అడియాసలయ్యే ప్రమాదం ఉంది. ఈ ప్రకటన వెనుక కార్పొరేట్శక్తుల హస్తం ఉందేమోనని సందేహం ఉన్నది. పేద, మధ్య తరగతి విద్యార్థులను బలవంతంగా కార్పొరేట్ కాలేజీల ఎంసెట్, ఐఐటీ, ఏఐఈఈఈ, జేఈఈ లాంటి శిక్షణ కోసం మళ్లించే విధంగా ఉంది.
తెలంగాణ ఏర్పాటు తర్వాత పేద, మధ్య తరగతి విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలనే మంచి సంకల్పంతో ప్రభుత్వం ప్రతి జిల్లాలో బీసీ, ఎస్సీ, గురుకులాలు, మైనారిటీ కాలేజీలను నెలకొల్పింది. ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా నిష్ణాతులైన అధ్యాపక బృందంతో బోధన చేయిస్తూ నాణ్యమైన విద్యనందిస్తున్నది. ప్రభుత్వ నిర్ణయంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో చేరారు. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి తీసుకున్న ఎంసెట్ లో వెయిటేజీ మార్కుల తొలగింపు నిర్ణయం గ్రామీణ, జిల్లా ప్రాంత స్థాయి విద్యార్థులకు అన్యాయం చేసేలా ఉన్నది. దీంతో గ్రామీణ, జిల్లా స్థాయిలో కష్టపడి చదివే పిల్లలకు, వాళ్ల తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. ఎంసెట్ లో ఇంటర్ మార్కుల వెయిటేజ్ అలాగే ఉంచాలి. మంత్రి నిర్ణయంపై పునరాలోచన జరగాలి.
–ఎండీ ఫిరోజ్ ఖాన్, రాజన్న సిరిసిల్ల జిల్లా