హైరైజ్ ​బిల్డింగులకు అనుమతులు ఇస్తలేరు!

హైరైజ్ ​బిల్డింగులకు అనుమతులు ఇస్తలేరు!
  • హెచ్ఎండీఏ అధికారుల తీవ్ర నిర్లక్ష్యం 
  • ప్రతి వారం జరిగే మల్టీస్టోరుడ్​బిల్డింగ్​ పర్మిషన్​కమిటీ మీటింగుకు మంగళం​
  • రెండు, మూడు వారాలకోసారి నిర్వహణ 
  • అయినా...కొర్రీలు పెడుతూ 
  •  దరఖాస్తుదారులను తిప్పుకుంటున్నరు 
  • పెండింగ్​లో వందల దరఖాస్తులు సంస్థ ఆదాయంపై ప్రభావం

హైదరాబాద్​సిటీ, వెలుగు:  హెచ్ఎండీఏకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న భవన నిర్మాణ అనుమతుల్లో జాప్యం జరుగుతోంది. నగరంతో పాటు హెచ్ఎండీఏ పరిధిలో భారీ భవనాలు (హైరైజ్​), కొత్త వెంచర్లకు లే అవుట్​పర్మిషన్లు ఇవ్వాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. హెచ్ఎండీఏ పరిధిలో నిర్మించే వివిధ రకాల ప్రాజెక్టులు, హైరైజ్​ భవనాల నిర్మాణాల కోసం ముందుగా టీఎస్​బీపాస్​ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ అప్లికేషన్లను పరిశీలించి అనుమతి ఇవ్వడానికి మల్టీస్టోర్డ్​​బిల్డింగ్​పర్మిషన్​కమిటీ సమావేశం జరగాల్సి ఉంటుంది. గతంలో వారానికోసారి ఈ మీటింగ్స్​నిర్వహించి అప్లికేషన్లను పరిశీలించి పర్మిషన్​ఇచ్చేవారు. కానీ, రెండు, మూడు నెలలుగా ఎంఎస్​బీ కమిటీ మీటింగ్స్​మూడు వారాలకోసారి నిర్వహిస్తున్నారు. దీంతో రెండు, మూడు నెలల నుంచి భవన నిర్మాణాలు, లే అవుట్ల పర్మిషన్ల కోసం చేసుకున్న దరఖాస్తులు వందల సంఖ్యలో పేరుకుపోయాయి. 

ఒక్కో అధికారి ఒక్కో రకంగా...

హెచ్ఎండీఏకు నెలకు దాదాపు 200 నుంచి 250 వరకు భవన నిర్మాణం, లేఅవుట్ల పర్మిషన్​కోసం దరఖాస్తులు వస్తుంటాయి. వారం వారం సమావేశం పెట్టి వీటిని క్లియర్​చేయాల్సి ఉంటుంది. కానీ మూడు వారాలకో, రెండు వారాలకో ..లేదా వారి ఇష్టమున్నప్పుడో మీటింగ్​పెట్టి దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. ఇందులోనూ చాలా అప్లికేషన్లను పెండింగ్​లోనే పెడుతున్నారు. అడిగితే నిర్మించే ప్రాజెక్టుకు సంబంధించి ఇరిగేషన్, రెవెన్యూ ఆఫీసర్ల నుంచి ఎన్​వోసీ తీసుకురావాలని రూల్​పెడుతున్నారు. 

తిప్పలు పడి అవి తీసుకువచ్చినా ఫీల్డ్​విజిట్​ చేయాల్సిన ప్లానింగ్​ఆఫీసర్లు ఫైళ్లను ముందుకు కదలనివ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీవో సంతకం చేస్తేనే తర్వాత పీవో సంతకం చేయాల్సి ఉంటుంది. పీవో పంపిన ఫైల్​పై మళ్లీ డైరెక్టర్​సంతకం చేయాల్సి ఉంటుంది. ఇలా కూడా రోజుల తరబడి ఫైల్​పెండింగ్​లో పడుతోంది. దీంతో హెచ్ఎండీఏ పరిధిలో కొత్త వెంచర్​ప్రారంభించాలని అనుకుంటున్న వారు, కొత్త నిర్మాణాలకు దరఖాస్తు చేసుకున్న వారు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. విసిగి వేసారి తమ ప్రాజెక్టులను వాయిదా వేసుకుంటున్నారు. హైడ్రా ఏర్పాటు తర్వాత పర్మిషన్లు ఇస్తే ఎక్కడ ఇరుకున పడాల్సి వస్తుందోనని అధికారులు పలు రకాల నిబంధనలు పెడుతూ తిప్పుకుంటున్నారని నిర్మాణదారులు ఆరోపిస్తున్నారు. 

హెచ్​ఎండీ ఏ ఆదాయం పై ప్రభావం!

గతంలో హెచ్ఎండీఏకు ఆయా ప్రాజెక్టుల అనుమతుల ద్వారా నెలకు దాదాపు రూ. 200 నుంచి రూ. 300 కోట్ల ఆదాయం వచ్చేది. కానీ, ప్రస్తుతం 100కోట్లు కూడా రావడం లేదని ఓ అధికారి వెల్లడించారు. నిజానికి ఒక్కో వెంచర్​కు ఎంత లేదన్నా రూ. కోటి నుంచి రూ. ఐదు కోట్ల వరకు హెచ్ఎండీఏకు ఫీజుల రూపంలో ఆదాయం వస్తుంది. అలాగే హైరైజ్​ భవనాలైతే ఒక్కో భవనానికి రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకు వస్తుంది. 

కానీ, ప్రస్తుతం భవన నిర్మాణాల అనుమతులు, లేఔట్స్​ పర్మిషన్ల జారీలో కొనసాగుతున్న తీవ్ర జాప్యం వల్ల హెచ్​ఎండీఏకు నెలకు రూ. వంద కోట్లు కూడా ఆదాయం రావడం లేదంటున్నారు. ప్రభుత్వం ఇటీవల హైడ్రా వల్ల అనవసర భయాలు వద్దని, అనుమతులున్న వాటిని కూల్చే ప్రసక్తి లేదని కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో భయం వీడిన కొంతమంది కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ముందుకు వస్తున్నా అధికారులు మాత్రం అనుమతుల జారీలో ఆలస్యం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.